- ఉత్తరాంధ్రకు మీరు అందించిన సేవలు అజరామరం
- మీ ఆశయ సాధన కోసం పునరంకితమవుతాం
- ఎర్రన్నాయుడుతో అనుభవాలను గుర్తు చేసుకున్న కార్యకర్తలు
- టిడిపి కేంద్ర కార్యాలయం, నిమ్మాడలో పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యుల ఘన నివాళులు
అమరావతి (చైతన్యరథం), నవంబర్ 2: మాజీ కేంద్రమంత్రి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చివరిక్షణం వరకు అలుపెరగని కృషిచేసిన మహనీయుడు, కేంద్ర మాజీమంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు 10వ వర్థంతి ఆయన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మాడలో ఏర్పాటు చేసిన ఎర్రన్నాయుడు కాంస్య విగ్రహాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్ర వరం శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఎర్రన్నాయుడు ఘాటు వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలలో పలువురు రక్తదానం చేశారు. రక్తదాతలను అచ్చెన్నాయుడు అభినందించారు.
ఎర్రన్న ఆశయసాధనకు పునరంకితమవుతాం
చివరిక్షణం ఉత్తరాంధ్ర అభ్యున్నతి కోసం పనిచేసిన ఎర్రన్నాయుడు ఆశయసాధన కోసం కృషిచేస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయనతో కలసి పనిచేసిన రోజులు మరువలేమని అన్నారు. కేవలం ఉత్తరాంధ్రలోనేగాక ఉమ్మడి తెలుగురాష్ట్రాల హృదయాల్లో ఎర్రన్నాయుడు చెరగని ముద్ర వేశారన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన హయాంలో రాష్ట్రానికి వేలకోట్ల నిధులు రాబట్టి అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడా రు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై యర్రన్న చూపిన చొరవ, కృషి, పట్టుదల తమకు మార్గదర్శక మని, ఆయన బాటలో పయనిస్తామని తెలిపారు.
ఉత్తరాంధ్ర బెబ్బులి ఎర్రన్నాయుడు
బీసీల అభ్యున్నతికి కింజరాపు ఎర్రన్నాయుడు అవిశ్రాంతంగా కృషి చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం ఎర్రన్నాయుడి 10వ వర్ధంతి జరిగింది. ఎర్రన్నాయుడు చిత్రపటానికి నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకుడంటే ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేటిరతం నేర్చుకోవాలని నేతలు అన్నారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఎర్రన్నాయుడిని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు రాజకీయాలలో ఒక విలక్షణమైన నాయకుడు ఎర్రన్నాయుడని అన్నారు. నమ్ముకున్న సిద్దాంతం కోసం తుదిశ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. 1999 నుంచి 2004 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారని, ముక్కు, మొహం తెలియని వాళ్లు వచ్చి అడిగినా కాదనకుండా సహాయం చేసేవారని తెలిపారు. తెలుగుదేశం గౌరవాన్ని జాతీయ స్థాయిలో ఇనుమడిరప చేశారని చెప్పారు. అలాంటి నాయకుడు మృతి చెంది దశాబ్ద కాలం గడిచిందంటే నమ్మలేకున్నామన్నారు. ఒక మహోన్నతుడైన బీసీ నాయకుడిని టీడీపీ కోల్పోవడం పార్టీకి తీరనిలోటని కాలువ శ్రీనివాసులు చెప్పారు. ఎర్రన్నాయుడు నేడు జీవించి ఉంటే జాతీయ రాజకీయాలు మరో విధంగా ఉండేవని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. ఎర్రన్నాయుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, కేంద్రమంత్రిగా, శాసన సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్‌గా విశేష సేవలు అందించారని చెప్పారు.
చంద్రన్న ఆత్మబంధు యర్రన్న
పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత ఎర్రన్నాయుడు అని మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ చెప్పారు. ఎర్రన్నాయుడికి తన సొంత అజెండా అంటూ ఏమీ లేదని, పార్టీ అజెండాయే తన అజెండాగా మర్చుకున్నరన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాష్ట్రానికి, తెలుగువారికి విశేష సేవలు అందించారని కొనియాడారు. అనేక మందికి నాయకులుగా ఎదిగేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. ఒకసారి నర్సీపట్నం సభలో తనని గుర్తించి చంద్రబాబుకి చెప్పి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఎర్రన్నాయుడు కల్పించారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అలాంటి నాయకుడు చనిపోవడం తమలాంటి వాళ్లకు, పార్టీకి కూడా తీరని లోటుని చెప్పారు. నాయకుడు ఎలా ఉండాలో ఎర్రన్నాయుడిని చూసి నేర్చుకోవాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా చెప్పారు. నేడు ఎర్రన్నాయుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మనతోనే ఉన్నాయన్నారు. ఎర్రన్నాయుడి కుటుంబానికి చంద్రబాబు ఎంతో అండగా నిలబడ్డారని చెప్పారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడిని పార్టీ అధ్యక్షునిగా, తనయుడిని పార్లమెంటు సభ్యునిగా, కుమార్తెను శాసన సభ్యురాలిగా చేసి ఆ కుటుంబానికి ఎంతో గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లలో ఎర్రన్న కీలకపాత్ర
నాడు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వే షన్లు కల్పించడంలోనూ. చంద్రబాబు హయాంలో 24 శాతం బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచడంలోనూ ఎర్రన్నాయుడు కీలకపాత్ర పోషించారని పార్టీజాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి చెప్పారు. కానీ, నేడు జగన్‌రెడ్డి ఆ బీసీ రిజర్వేషన్లను తిరిగి 24 శాతా నికి కుదించడంతో 16,500స్థానిక సంస్థల పదవులు బీసీలు కోల్పోయినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి బీసీలకు సాధికారత సాధించిన రోజే ఎర్ర న్నాయుడికి నిజమైన నివాళి అని చెప్పారు.
శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బొద్దులూరి వెంకటేశ్వరరావు, ఎన్నారై కో ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, కార్పొరేటర్ వేముల పల్లి శీరాం ప్రసాద్, ఆహ్వాన కమిటీ సభ్యులు హాజీ హసన్ బాష. హెచ్‌ఆర్డీ సభ్యులు ఎస్.పి సాహెబ్, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి, సయ్య ద్ అహ్మద్ అలీ, పప్పుల దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.