విశాఖపట్నం (చైతన్య రథం): క్యాప్ జెమిని సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై సాగిన కీలక సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… “ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్‌లాంటి సంస్థలు విశాఖలో కాలుమోపాయి. మరో మూడునెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంకానుంది. దేశంలో మరే ప్రాంతంలోనిలేని ఐటీ ఎకో సిస్టమ్ విశాఖపట్నానికి మాత్రమే సొంతం. అన్ని అనుకూలతలున్న విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంగల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ఏపీలో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి, డిజిటల్ టాలెంట్ పైప్‌లైన్) ఏర్పాటుకు ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కోడెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించండి. క్యాప్ జెమినీ డెడికేటెడ్ క్వాంటం వర్టికల్‌ను స్థాపించడమేగాక ఆప్టిమైజేషన్, ఫైనాన్సియల్ సర్సీసెస్, సస్టయినబిలిటీవంటి రంగాల్లో ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకరించండి” అని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ స్పందిస్తూ… “1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షలమంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నారు. స్ట్రాటజీ అండ్ ట్రాన్సఫర్మేషన్, క్లౌడ్, డేటా అండ్ ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్స్, మేనేజ్డ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీలో కోర్ వర్టికల్స్ సేవలు అందిస్తున్నాం. భారత్‌లోని హైదరాబాద్, చెన్నై, ముంబయి, పూనే, నోయిడా, కోల్‌కతా, గురుగావ్, భువనేశ్వర్ సహా 13నగరాల నుంచి తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి” అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ చెప్పారు. సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్‌చాకే, డబ్ల్యూఎనఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ పాల్గొన్నారు.














