టిడిపి అధికారంలోకి వచ్చాక మైదుకూరులో ఉల్లికొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి రైతులను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మైదుకూరు బాబా గుడి వద్ద నియోజకవర్గ ఉల్లి రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా నియోజకవర్గంలో పండించే విదేశీరకం కె.పి.ఉల్లి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. కె.పి.రకం ఉల్లి ఎకరా పంటకు 15 నుండి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది, లక్ష రూపాయలు ఖర్చవుతుంది. క్వింటాకు రూ.10వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. మైదుకూరులో ఆగష్టు నెలలో ఉల్లి కొనుగోలు కేంద్రం పెట్టి కొనుగోలు చేయాలి. దళారులు పంట కొనుగోలు చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉల్లి రైతులకు న్యాయం చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో మొట్టమొదటి బాధితులు రైతులే. ఎన్నికల సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారు. జగన్ మాయమాటలను నమ్మిన రైతులను నట్టేట ముంచేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, దళారీల దోపిడీ బారినుంచి కాపాడతాం. ఉల్లి రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందజేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.