- తొలిరోజే పాలనలో మార్పు చూపించిన టీడీపీ అధినేత
- ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని అధికారులకు హితవు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ ఉండవని నిరూపించారు. రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్ లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాకానుక పథకం కింద.. 9 లక్షల మందికిపైగా చిన్నారులకు కానుకలు పంచాలి. ఈ విద్యాకానుకలో ప్రతి విద్యార్థికీ.. ఒక బ్యాగు, పుస్తకాలు, షూస్, టై, రెండు జతల యూనిఫాం ఉన్నాయి. అయితే.. వీటిలో బ్యాగులు, బెల్ట్‌లపై జగన్ బొమ్మలు ఉన్నాయి.
షూస్‌పై మాత్రం జగనన్న విద్యా కానుక అని రాసి ఉంది. దీంతో అధికారులు తటపటాయించారు. వీటిని పంపిణీ చేయాలా..వద్దా అనే మీమాంసలో పడిపోయారు. దీంతో గురువారం ఉదయం వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. ఎందుకంటే రాష్ట్రంలో సర్కారు మారిపోయింది. కాబట్టి గత ముఖ్యమంత్రి ఫొటోలు ఉన్న వాటిని పంచితే.. ఏం జరుగుతుందో అని భయపడ్డారు. అయితే.. తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని మీడియా తీసుకురావటంతో ఆయన వెంటనే..జగన్ బొమ్మ ఉన్నా.. సరే.. పంచేయండి. రెండు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాలని అక్కడిక్కడే తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని నేరుగా సీఎస్‌కు చెబుతున్నట్టు కూడా ఆయన వెల్లడిరచారు. దీంతో అందరూ ఆశ్యర్యపోయారు. గతంలో చంద్రబాబు చేపట్టిన అనేక పథకాలను జగన్ నిలిపి వేశారు. దీంతో కోట్లకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అయిపోయి.. తుప్పు పట్టింది. కానీ, చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకునే సరికి అందరూ అవాక్కయ్యారు.
పగ, ప్రతీకారాలుండవన్న టీడీపీ
ఇదే విషయాన్ని టీడీపీ అధికారిక వెబ్‌సైట్ లోనూ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృథా అవకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు.
ప్రజాధనం వృథా అవకూడదని ఆలోచించే చంద్రబాబుకు, మాజీ సీఎం జగన్ కు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. తన పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, పగ ప్రతీకారాలకు తావులేదని, తుగ్లక్ నిర్ణయాలు అసలే ఉండవని చంద్రబాబు చెప్పారు. తాను చెప్పిన మాట మేరకు.. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్ కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్‌ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.