- అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్ప హత్య బాధాకరం
- ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది
- కూటమి ప్రభుత్వం వచ్చాక 9 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారు
- అధినేత జగన్ దారిలోనే వైసీపీ మూకలు
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని, ఆ పార్టీ హత్యా రాజకీయాలు మానటం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ కార్యకర్త గొల్ల ఆదెప్పను వైసీపీ నేతలు హత్య చేయటం బాధాకరమన్నారు. కర్ణాటక వెళ్లి తిరిగివస్తున్న ఆదెప్పను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు అతనిపై కత్తులతో దాడి చేసి నరికి చంపారన్నారు. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైసీపీ రౌడీ మూకలు పయనిస్తున్నాంయని విమర్శించారు. అరాచకపాలనను భరించలేక ప్రజలు ఛీకొట్టినా జగన్మోహన్ రెడ్డి హింస, హత్యా రాజకీయాలు మానటం లేదని పల్లా ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ 9 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఆలయ అర్చకత్వం విషయంలో ఆదెప్పతో గొడవ పడిన వైసీపీ కార్యకర్తలు అతనిపై కక్ష పెట్టుకుని మాటు వేసి హతమార్చారన్నారు. మృతుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆదెప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.