- సీఎం చంద్రబాబు అపార అనుభవం అక్కరకు వస్తోంది
- టిడ్కో ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలి
- పాలకొల్లులో మంత్రి నారాయణ
పాలకొల్లు(చైతన్యరథం): రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి నిధుల కొరత లేకుండా చూస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి, భారీగా అప్పులు చేసి వెళ్లిపోయినా చంద్రబాబు అపార అనుభవంతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదలకు రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం ఎందుకు మూసేసిందో తెలియదన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జల వనరుల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో కలిసి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్, హిందూ శ్మశాన వాటిక ( కైలాస వనం), డంపింగ్ యార్డు, డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలామ్ హెల్త్ పార్క్, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, బొండాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ టిడ్కో ఇండ్ల సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు.
పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండిరగ్‌లో ఉన్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.ఆ తర్వాత మున్సిపల్ ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు అధికారులు వివరించారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ, ముందుగా టిడ్కో ఇళ్ల వద్ద అవసరమైన మౌలిక వసతులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల కోసం ఎంత ఖర్చయినా పర్వాలేదని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. పేదలు సౌకర్యంగా నివసించేలా ఇళ్లు నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. ఆధునిక సౌకర్యాలతో టిడ్కో ఇళ్లను నిర్మించాం. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను సర్వనాశనం చేసింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సంఖ్యను కూడా తగ్గించింది. పేదలు ఎల్లప్పుడూ పేదలుగా ఉండాలనేది గత సీఎం జగన్ ఆలోచన. 2014లో టీడీపీ హయాంలో 9 లక్షల గృహాలు మంజూరు చేశామని… ఇది దేశంలోనే రికార్డు అని మంత్రి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు జగనన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని అన్నారు. ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని చెప్పారు.
విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం: నిమ్మల
రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా.. వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. టిడ్కో ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇళ్ల లబ్ధిదారులను బలవంతంగా రుణగ్రస్తులను చేశారని చెప్పారు. పది శాతం పెండిరగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ఒక్క పాలకొల్లులోనే రూ.150 కోట్లు ఇళ్లను తాకట్టుపెట్టి ఆ నిధులను మాజీ సీఎం జగన్ పక్క దారి పట్టించారని విమర్శించారు. ప్రపంచ స్థాయిలో మళ్లీ అమరావతిని తిరిగి నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, ఆర్డీవో ఎం.అచ్యుత అంబరీష్, శాసనమండలి మాజీ సభ్యుడు అంగర రామ్మోహన్, మునిసిపల్ కమిషనర్ విజయ సారథి, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నారాయణ కు ఘన స్వాగతం
పాలకొల్లులో అభివృద్ధి పనులు పరిశీలనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ కు ఘన స్వాగతం లభించింది. ముందుగా బ్రాడీపేట మున్సిపల్ వాటర్ వర్క్స్‌నకు చేరుకున్న ఆయనకు మంత్రి నిమ్మల రామానాయుడు శాలువా కప్పి గజమాల వేసి సత్కరించారు. కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పూలమాలలు వేశారు.