- ప్రభుత్వం దృష్టిలో చిన్న పరిశ్రమ, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమే
- పెట్టుబడులు గ్రౌండింగ్‌పై దృష్టి కేంద్రీకరించాలి
- ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం
- 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం
ఉండవల్లి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటివరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతోపాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో యువతకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రజా ప్రభుత్వ వాగ్దానం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రతిఒక్కరు కంకణబద్దులై పనిచేయాలి. నైపుణ్యం పోర్టల్ మాదిరిగానే ప్రతిఒక్క ఉద్యోగాన్నీ ఆధార్/ కేవైసీ లింకేజీతో ట్రాక్ చేయాలి. మా దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమే. ఉద్యోగాల కల్పనే మాకు ముఖ్యం. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో సింగపూర్, దుబాయ్‌కంటే సులభతరంగా ఉండాలి. పరిశ్రమలకు అవసరమైన అన్ని శాఖలవారీ అనుమతులు, ఎన్వోసీలను మ్యాపింగ్ చేసి వాటి స్థితి, గడువు ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు గ్రౌండింగ్‌పై అధికారులు ప్రధానంగా దృష్టిసారించాలి. సమస్యలను గుర్తించాలి. దీనిపై ప్రతివారం సమీక్షిస్తాం. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను ట్రాక్ చేస్తాం. ఈడీబీని మరింత బలోపేతం చేస్తాం. ప్రతి శాఖ ఈడీబీ ట్రాకర్‌ను పర్యవేక్షించేందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ను నామినేట్ చేయాలి” అని ఆదేశించారు. ఎంఎసఎంఈ పార్క్‌లు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకింగ్ అంశాలపైనా సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













