- సాగు నీటి సరఫరాలో ఇబ్బందులు రాకూడదు
- ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి
- ఎస్‌ఈ నుండి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్దాయిలో పర్యటించాలి
- అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను, కలెక్టర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. రబీ సీజన్ మరో పది, పదిహేను రోజుల్లో ముగుస్తుండటంతో కాలువల ఆయకట్టు చివరి రైతులకు సైతం సాగు నీరందించేందుకు నీటి నిర్వహణ సక్రమంగా చేసుకోవాలన్నారు. జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, కర్నూలు, ఒంగోలు జిల్లాల సీఈలతో పాటు వారి పరిధిలోని ఎస్‌ఈలు, ఈఈలతో శుక్రవారం మంత్రి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయుకట్టు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయుకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయుకట్టు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని అధికారులను మంత్రి రామానాయుడు ఆదేశించారు.
నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి రామానాయుడు.. సాగునీటి సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్యయం చేసుకుంటూ వారాబందీ పగడ్బందీగా నిర్వహిస్తూ, ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించాలని స్పష్టం చేశారు. రబీ సీజన్ ముగుస్తుండడంతో ఎస్‌ఈ స్థాయి అధికారుల నుంచి, ఈఈలు, డీఈఈ లు, ఏఈఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రబీ పంటకు రానున్న పది, పదిహేను రోజులు ఎంతో కీలకం అని, రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కాలువల్లో పూడికలు, తూడు తొలగింపు, లాకుల మరమ్మత్తులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని మంత్రి స్పష్టం చేశారు.