- సాక్షిలోనే చర్చ పెట్టండి, మాట్లాడతా
- షర్మిల కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తా
- వివేకా కుమార్తె సునీత స్పష్టీకరణ
హైదరాబాద్: షర్మిలకే నా మద్దతు.. ఆమె కోసం ఇల్లిల్లూ తిరుగుతా.. జగన్‌ను మట్టి కరిపిస్తా! అని ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్న ఆ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలకు ఆమె మద్దతు ప్రకటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిలకు సునీత అభినందనలు తెలిపారు. ఆమెను ఎంపీగా పోటీ చేయించాలని తన తండ్రి శాయశక్తులా ప్రయత్నించారని… ఈ క్రమంలోనే హత్యకు గురయ్యారని చెప్పారు. 2012లో జగన్ జైలుకు వెళితే 15 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచేలా షర్మిల కృషి చేశారన్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసినట్లు గుర్తుచేశారు. అంత కష్టపడి వైకాపాను నిలబెట్టిన తర్వాత తను ఇంకా శక్తిమంతురాలిగా ఎదుగుతుందని భయపడి జగన్ ఆమెను పక్కన పెట్టారన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు చెపారు. తన కంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ ఆందోళన చెందారని అందుకే పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పక్కన పెట్టారని విమర్శించారు.
సీఎంగానైనా జవాబు చెప్పాలి
ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని… పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలన్నారు. వైఎస్ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్, వైకాపా నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందన్నారు. తప్పును గ్రహించానని… దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని చెప్పారు. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా… సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినాష్‌ను ఎందుకు కాపాడుతున్నారు?
వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని జగన్ అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో… ఎవరు చేయించారో మీకూ తెలిసినట్లే కదా! అది ఎందుకు బయట పెట్టడం లేదు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే… ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంత భయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదు… మీ సాక్షి చానల్‌కి వస్తా… డిబేట్ చేద్దాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని సునీత వ్యాఖ్యానించారు. మా నాన్నను ఎవరు చంపారో.. ఎందుకు చంపారో.. ఎక్కడో మాట్లాడడం కాదు. నేరుగా జగనన్న సొంత ఛానెల్ సాక్షిలోనే మాట్లాడతా? నన్ను ఇంటర్వ్యూ చేసే దమ్ము ఈ మీడియాకు ఉందా? ఉంటే చెప్పండి ఇప్పుడే ఈ క్షణమే సాక్షిలో అన్ని విషయాలు చెబుతా అని సునీత సవాల్ విసిరారు.
షర్మిలను కలిసి సంఫీుభావం తెలుపుతానని.. ఆమె కోసం ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసేందుకు తాను త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేసుకుంటానని అన్నారు. దీనికి గాను తాను ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయి. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలి. లేకపోతే ఆ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు. ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదు. నా తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలి. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దాం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని సునీత కడప ప్రజలకు పిలుపునిచ్చారు.