- పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు
- విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతున్న భవనాలు
- ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం అయింది. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నత అధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్ర రాజధాని అమ రావతిలో మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర వేడుకలకు జంగారెడ్డి గూడెం ఏఎస్పీ, ఐపీఎస్ అధికారి ఆర్. సుస్మిత పరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. భారత ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ 2వ పోలీస్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, పోలీసు సాయుధ దళాలు, ఆంధ్రప్రదేశ్ 16వ పోలీస్ బెటాలియన్, బాలురు, బాలికల విభాగాల ఎన్సీసీ క్యాడెట్స్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల విద్యార్థులు, రెడ్ క్రాస్ యువ దళం కంటింజెంట్స్, స్పెషల్ పోలీస్ బ్రాస్ బాండ్, స్పెషల్ పోలీస్ భారత ఆర్మీ మ్యూజిక్ బాండ్లు ఇందులో పాల్గొనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై 22 శాఖలు శకటాలను ప్రదర్శించనున్నాయి. ఏర్పాట్ల పరిశీలనలో జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమి షనర్ కె. మయూర్ అశోక్, ప్రోటోకాల్ సంచాలకులు మోహన రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శాసనమండలి, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుల్లో జెండా ఆవిష్కరణలు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ భవనం ప్రాంగ ణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షుడు కె. మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 8.15 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఏపీ సచివాలయం మొదటి భవనం వద్ద సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. నేలపాడు ఉన్నత న్యాయస్థానం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
విద్యుద్దీపాలతో విరజిమ్ముతున్న భవనాలు
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దారు. సచివాలయంలోని 5 భవనాలు సహా అసెంబ్లీ భవనాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆయా భవనాలతో పాటు అసెంబ్లీ, సచివాలయం ప్రాంగణాల్లోని రోడ్లకు ఇరు వైపులా రహదారులు, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో సచి వాలయ ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే మొదటి భవనాన్ని త్రివర్ణ పతాక వర్ణం ఉట్టిపడేలా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అదేవిధంగా సచివాలయ ప్రైవేశ మార్గానికి సమీపంలోని ఐదవ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని కూడా ఇదే రీతిలో అలంకరించడంతో ఈ భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయ వాడ లోక్ భవన్, ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సహా ప్రకాశం బ్యారేజ్, ఇతర చారిత్రక ప్రాముఖ్యత గల భవనాలు ప్రముఖ కట్టడాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వాహనదారులకు ట్రాఫిక్ డైవర్షన్ సూచనలు
తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రముఖులు, ప్రజల వాహనాల రాకపోకల కోసం ఈ క్రింది ట్రాఫిక్ మార్గాలను కేటాయించారు.
రూట్ – 1: VVIP,AA, A1, A2 పాసులు, రైతులు లోటస్ -కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్ ఆశ్రమం సీడ్ యాక్సెస్ రోడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎడమవైపు నుంచి వేడుకల మైదానానికి చేరుకోవాలి. రూట్ – 2: బి1, బి2 పాస్ హోల్డర్స్, రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందుకు వెళ్లి వెస్ట్ టైపాస్ రోడ్డు నుంచి వేడుకల మైదానములోకి చేరుకోవాలి. గుంటూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు మురుగన్ హోటల్ సెంటర్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లి ఈ8 రోడ్డు అండర్ పాస్ – మందడం గ్రామం వెలగపూడి గ్రామం- మోదుగు లింగాయపాలెం – ఈ 4 పాతవెలగపూడి రోడ్డు జంక్షన్ నుండి ఈ4 రోడ్ పార్కింగ్ ప్రదేశానికి వెళ్లవలెను. విజయవాడ వైపు నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ ప్రకాశం బ్యారేజ్- ఉండవల్లి ఉండవల్లి గుహలు పెనుమాక – కృష్ణయ్యపాలెం – మందడం- వెలగపూడి ఈ4 రోడ్డు జంక్షన్ – మోదు లింగాయపాలెం ఈ4 రోడ్ పార్కింగ్ వెళతారు. గొల్లపూడి నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ -వెంకటపాలెం – ఈ8 అండర్ పాస్ మందడం వెలగపూడి ఈ4 జంక్షన్ – మోదులింగాయపాలెం ఈ రోడ్ పార్కింగ్ ప్రదేశానికి వెళతారు.
తుళ్లూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు తుళ్లూరు – ఈ6 వెస్ట్ పార్క్ రోడ్ హైకోర్టు ఈ ఫోర్ జంక్షన్ నుంచి ఈ4 పార్కింగ్ ప్రదేశానికి వెళతారు. హైకోర్టు లాయర్స్ వాహనాలు ప్రకాశం బ్యారేజ్ ఉండవల్లి ఉండవల్లి కేవ్స్ – పెనుమాక కృష్ణాయపాలెం మందడం వెలగపూడి- ఈ 4 రోడ్డు పార్కింగ్ ప్రదేశానికి వెళతారు. అందరూ పోలీస్ వారి సూచనలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.















