- ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి
- సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయి దృష్టిపెట్టండి
- కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులు
- పకడ్బంధీగా మహిళలకు ఉచిత బస్సు పథకం
- రవాణా శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతోపాటు నిర్వహణ, మైలేజ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలోనూ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలులో కేంద్రం ఇస్తున్న సబ్సీడీలను వినియోగించుకుని 1253 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని అధికారులకు సూచించారు. బస్సులు అద్దెకు తీసుకునే విధానంవల్ల లాభనష్టాలు, సొంతంగా బస్సులు కొనుగోలు చేయడంవల్ల కలిగే ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీఎం సూచించారు.
గత ప్రభుత్వం కొత్తగా బస్సుల కొనుగోలు చేయలేదని, 15 లక్షల కి.మీ కంటే ఎక్కువ తిరిగిన బస్సులు కూడా ప్రస్తుతం సర్వీసులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే బస్సులకు బ్రేక్ డౌన్ సమస్యలు తలెత్తి, ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ…. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు తగ్గించిందని, తిరిగి సర్వీసుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. క్రమంగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సుల వైపు ఆర్టీసీ వెళ్లాలని సూచించారు. ఆర్టీసీ కార్గో ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ విధానాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలన్నారు.
ఇప్పటికే ప్రతిపాదించిన 1489 డీజిల్ బస్సులను కూడా సమకూర్చుకోవాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది తప్ప, ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రమాదాల నివారణకు ఎస్పీ, కలెక్టర్, రోడ్ సేఫ్టీ అధికారులు సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌స్పాట్స్ గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ను ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డు అందించాలన్నారు.
ఉచిత బస్సు పథకంపై సమీక్ష
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఢల్లీి, కర్నాటక, పంజాబ్, తమిళనాడుతోపాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఈమేరకు అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. రెండు రోజులు ఆలస్యమైనా లోపాలకు తావులేకుండా, మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా విధానాలు రూపొందించాలన్నారు.