- ఓట్ల జాబితాలో భారీగా అక్రమాలు
- కక్ష సాధింపులపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి
- ప్రజాసమస్యలు పట్టని పాలకులు
అమరావతి: రాష్ట్రంలో అధికార దుర్వినియో గంతో వ్యవస్థలన్నీ గాడి తప్పిన విషయాన్ని పార్ల మెంటులో ప్రస్తావించాలని టీడీపీ ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా అన్ని రంగాల్లో విఫలమైన వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడి లబ్ధి పొందేందుకు చేస్తున్న కుటిల యత్నాలను కూడా పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రం పలు పథకాలకు విరివిగా నిధులు ఇస్తుందని…అయితే రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక పథకాలు నిలిచిపోయాయని…దీని వల్ల అంతిమంగా రాష్ట్ర ప్రజలు నష్టపోయారని సమావేశం అభిప్రాయపడిరది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ నిధుల సద్వినియోగంపై లేదని నేతలు అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ అధికార పార్టీ చెప్పుచేతల్లో పెట్టుకుని నడిపిస్తున్న విధానాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అన్ని విధాలా విఫలమైన జగన్ ప్రభుత్వం ఓట్ల జాబితాలో అక్రమాల ద్వారా లబ్ధి పొందాలని చూస్తోందని, ఈ అంశంపై ఢిల్లీలో గళం వినిపించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, విభజన చట్టం హామీల సాధనలో విఫలమవడం వంటి అంశాలను లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావన ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్థన్, గురజాల మాల్యాద్రి పాల్గొన్నారు.