- రుణంలోనూ వెసులుబాట్లు ఇవ్వాలి
- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ వినతి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీ ఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఢల్లీి పర్యటనలో ఉన్న పవన్ మంగళవారం నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూ. 3834.52 కోట్ల ఏఐఐబీ ప్రాజెక్టును 2026, డిసెంబర్ 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న గడువు సరిపోదని తెలిపారు. అలాగే ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని కోరారు. రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో కాకుండా పనులు చేపట్టేందుకు ముందుగానే నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70 (ఏఐఐబీ): 30 (ఏపీ ప్రభుత్వం) విధానాన్ని 90: 10 గా మార్చాలని కోరారు.
పిఠాపురంలో ఆర్వోబీ ఏర్పాటు చేయండి
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట ` ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢల్లీిలో అశ్విని వైష్ణవ్‌తో పవన్ సమావేశమై పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాందేడ్ – సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ – విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం – న్యూఢల్లీి)కి పిఠాపురంలో హాల్ట్ అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తన మహారాష్ట్ర పర్యటనలో తిరుపతికి నేరుగా రైలు ఏర్పాటు చేయాలని లాతూరు ప్రజలు చేసిన విన్నపాన్ని రైల్వేశాఖ మంత్రి ముందు పవన్ ఉంచి, ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు.
ఉపాధి పనుల అంచనా వ్యయం పెంచాలి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఢల్లీి పర్యటనలో భాగంగా మంగళవారం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ ఆయిన పవన్ పలు కీలకమైన అంశాలపై చర్చించారు. ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్‌ను పెంచడం ఎంతో ప్రయోజనకరం. ఉపాధి పనుల్లో భాగంగా పీఎమ్ ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజులు పని దినాలు ఉంటాయి. అలాంటి వారికి అదనంగా 100 రోజుల పని దినాలు కల్పించాలనేది మా ఆలోచన. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. దీంతో పాటు ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాలకు ప్రహరీల నిర్మాణం, దోబీఘాట్ లు, ఆరోగ్య సబ్ సెంటర్లు, గ్రామాల్లో తాగునీటికి అవసరమైన పనులు చేసేందుకు అవకాశం ఇస్తే గ్రామీణులకు మరింత ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ షెడ్ పథకం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా కరవు ప్రాంతాల్లో ఎంతో ఉపయోగపడే ఈ పథకానికి రాష్ట్ర వాటా నిధులను తగ్గించి 90: 10 దామాషా ప్రకారం నిధుల కేటాయింపులు జరపాలని పవన్ కోరారు.
గ్రామీణ రోడ్లను ఆధునీకరించడానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు, నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని గుర్తిస్తే, దానిలో పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించింది. 2,230 గ్రామాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాల్సి ఉంది. గ్రామీణ సడక్ యోజన ` 4 కింద గ్రామాల్లోని అంతర్గత రహదారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. 100 జనాభా దాటిన గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసుకునేందుకు పథకంలో చోటు కల్పించాలని కేంద్ర మంత్రిని పవన్ కోరారు.