న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉన్నందున పోలింగ్ సమయం పెంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. ఏపీలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచాలని ఈసీకి కనకమేడల విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 తర్వాత మరో గంట పాటు పోలింగ్ కొనసాగేలా అనుమతించాలని తన లేఖలో కోరారు. కాగా, తెలంగాణలో పలు పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ సమయాన్ని గంట పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
సాక్షి కథనాలపై చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి దినపత్రికలో వస్తున్న సత్యదూర, పక్షపాత ధోరణితో కూడిన వార్తా కథనాలపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి కనకమేడల మరో లేఖ రాశారు. ప్రతిరోజూ సాక్షి పత్రికలో ఏన్డీఏ కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా, అధికార వైసీపీకి అనుకూలంగా ఉండేలా అబద్ధాలతో కూడిన కథనాలు పుంఖానుపుంఖానులుగా వస్తున్నాయన్నారు. ఇలాంటి పక్షపాత ధోరణితో కూడిన కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలన్నారు. ఆయా కథనాలకు అయ్యే మొత్తం డబ్బును సంబంధిత వైసీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యయంలో కలిపేసి చర్యలు తీసుకోవాలని సీఈసీని కనకమేడల కోరారు.