- అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ పెట్టించిన కేసులు కొట్టేయాలి
- గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ కంప్యూటర్ టీచర్ల ఆవేదన
- భూ కబ్జాలపై పలువురు బాధితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన కేంద్ర మాజీమంత్రి పనబాక, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన
అమరావతి (చైతన్యరథం): టీడీపీ తరఫున వివిధ పదవులు నిర్వహించి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న తనపై కక్షగట్టి.. గత 40 ఏళ్లలో ఒక్క కేసు కూడా లేకపోయినా.. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ ఏకంగా 8 కేసులు పెట్టించారని టీడీపీ నేతల వద్ద అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఆర్‌జీ శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెట్టించిన తప్పుడు కేసులను కొట్టేయాలని నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురవారం నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మీ, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజులు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన జగతి వైద్యనందం విజ్ఞప్తి చేస్తూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మున్సిపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్స్‌గా పనిచేస్తున్న 283 మందిని గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని ఫిర్యాదు చేశారు. 2019 నుండి అధికారుల చుట్టూ తిరిగినా తమను పట్టించుకోలేదని. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.
పల్నాడు జిల్లా అమరావతికి చెందిన బండారు సూర్యదేవి నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. తాము స్థలాన్ని కొనుగోలు చేసి రేకుల షెడ్ వేసి ఆ ఇంటిని అద్దెకు ఇస్తే.. అద్దెకు తీసుకున్న షేక్ మస్తాన్ ఇంటిని కబ్జా చేసే కుట్రలో భాగంగా దొంగ ఇంటిపన్నులు పుట్టించారని, విషయం తెలుసుకుని వెళ్లి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని, దయచేసి తగిన చర్యలు తీసుకుని తమ ఇంటి నుండి వారిని ఖాళీ చేయించాని వేడుకున్నారు.
అనంతపురం జిల్లా బెలగుప్ప మండలం యలగలవంక గ్రామానికి చెందిన వన్నూరు స్వామి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రికి ప్రభుత్వం పొలం ఇచ్చి, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేస్తే, ఆ భూమిని కొంత మంది భూస్వాములు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, భూ కబ్జాదారులనుండి తన భూమిని విడిపించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి మంచాల మెర్సి వినోదిని విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త మంచాల శివయ్య టీడీపీ నాయకుడిగా ఉంటూ అనారోగ్యంతో అకాల మరణం చెందాడని, కుటుంబం అప్పులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని నేతలకు అర్జీ ఇచ్చి వేడుకున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని మల్లిఖార్జునగూడెం చెంచులు పలువురు విజ్ఞప్తి చేస్తూ.. తమ గూడెంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, తమ గూడెంకు రహదారి ఏర్పాటు చేయటంతోపాటు, గూడెంలో సీసీరోడ్లు వేయాలని, గూడెంకు వచ్చే దారిలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించాలని నేతలను కోరారు.
వివిధ సమస్యలతో పాటు పలువురు కొత్త పింఛన్‌లు, రేషన్ కార్డుల కోసం అర్జీలు ఇవ్వగా.. ఉద్యోగాలు కల్పించాలని పలువురు నిరుద్యోగులు అభ్యర్థించారు. అర్జీలు స్వీకరించిన నేతలు న్యాయం జరిగేలా చూస్తామంటూ వారికి హామీ ఇచ్చారు.