అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులపై చర్చలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సోమవారం వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు క్యాన్సర్‌తో భాదపడుతున్నారని, అది మూడో దశలో ఉందని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసమే చంద్రబాబు అమెరికా వెళ్లారని వైసీపీ నాయకుడు వర్రా రవీంద్రరెడ్డి ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌పై వర్ల ధ్వజమెత్తారు. ఇటువంటి తప్పుడు సమాచారం ప్రచారం సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. తమ అధినేత ప్రతిష్ఠను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వర్రా రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని లేఖలో కోరారు. గతంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేశారంటూ ఎన్నికల సంఘాన్ని వర్ల రామయ్య ఆశ్రయించారు. పరిశీలించిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీని ఆదేశించింది. దీంతో సజ్జల భార్గవ్‌పై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయినా భార్గవ్‌లో మార్పు రాలేదని వర్ల విమర్శించారు.