- బాధ్యులపై కఠిన చర్యలు
- మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
- గత ప్రభుత్వ తప్పిదాల కారణంగానే ఇసుక ఇక్కట్లు
- ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు ఉచిత ఇసుక అందించి తీరుతాం
- 16 నుండి అందరికీ అందుబాటులో ఇసుక
- ఇసుక కొరత అంటూ సోషల్ మీడియాలో ప్రచారంపై మంత్రి ఆగ్రహం
మచిలీపట్నం (చైతన్యరథం): ఉచిత ఇసుక పథకంపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం ఆర్ అండ్ బీ అతిధి గృహంలో సోమవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు, అక్రమ తవ్వకాల కారణంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఎన్జీటీ కేసులను గత పాలకులు నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇసుక విధానంలో కఠిన నిబంధనలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజలకు ఉచిత ఇసుకను అందించేందుకు పద్ధతి ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు. ఇసుక ఉచితంగా తీసుకు వెళ్లడానికి ప్రజలకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 108 మాన్యువల్ రీచ్‌లు, 48 సెమీ మాన్యువల్ రీచులు, 28 డీసిల్టేషన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఈనెల 16 నుండి ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక అందుబాటులోకి తెస్తున్నాం. జగన్ రెడ్డి గత ఐదేళ్ల పాటు సాగించిన ఇసుక దోపిడీని, అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. కొంతమంది దళారులతో ఇసుక ఎక్కువ రేటుకు అమ్ముతున్నారన్నారు. ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. ఎలాంటి తప్పిదం జరిగినట్లు తేలినా కఠిన చర్యలుంటాయి. 16వ తేదీ నాటికి రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉండటంతో ఆ డిమాండ్ మేరకు ఇసుక అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సొంత వాహనాలు ఉన్నవారు కేవలం సీనరేజి ఛార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు. బోట్ మెన్ సొసైటీ నుండి కానీ, వెబ్ సైట్ నుండి కానీ ఇసుక బుక్ చేసుకోవచ్చును. స్టాక్ పాయింట్ల నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండాలని, పరిమితికి మించి స్టాక్ ఉన్నట్లైతే చర్యలు తప్పవని అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
“