రాఫ్తాడు : వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రైతాంగం అనేక ఇబ్బందులకు గురౌతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అనేక మంది రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. రైతులకు సకాలంలో పంటలకు నీరందించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె వెంకటాపురం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి స్వయంగా వరినాట్లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమోటా పంటకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాత పంటను రోడ్లపై పోయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటామన్న ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టకపోగా పండిన పంటకు సైతం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్యాయనవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు నష్టం గలకుండా ప్రభుత్వం వెంటనే పంటను కొనుగోలు చేయాలన్నారు. రైతులకు సబ్సీడీ రుణాలతో పాటు వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు అందించాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.