- నూటికి నూరు శాతం ఈ-క్రాప్ నమోదు చేయాలి
- జులైలో భారీవర్షాలకు నష్టపోయిన రైతులకు రూ.36 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ
- పొలాల్లో పురుగు మందుల పిచికారికి డ్రోన్ల వినియోగం
- రాష్ట్రంలో డ్రోన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు
- మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీ పార్కు ఏర్పాటుకు కృషి
- వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో రైతులకు ఎక్కడా విత్తనాలు కొరత రాకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూలైలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేందుకు వీలుగా రూ.36 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వందశాతం ఈ-క్రాప్ నమోదు చేయాలన్నారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి రైతుకు నికర ఆదాయం పెరిగేలా వ్యవసాయంలో తగిన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అ దిశగా తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం సమీక్షించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలను, పథకాలను, ఆ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయంలో ఉత్పత్తిని పెంపొదించడంతో పాటు రైతుకు నికర ఆదాయాన్ని పెంచేలా సాంకేతికతను వినియోగించాలన్నారు. సాగులో ఉత్తమ విధానాలను అవలంబించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంతోపాటు రైతుకు నికరాదాయాన్ని పెంచే రీతిలో సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. పంట పొలాల్లో పురుగు మందులు పిచికారి వంటి వాటికి డ్రోన్‌ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. కేంద్ర పౌర విమానయాన శాఖతో మాట్లాడి రాష్ట్రంలో డ్రోన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నేలల్లో తేమను గుర్తించేందుకు శాటిలైట్ సేవలను వినియోగించు కోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఉద్యానపంటల్లో అగ్రస్థానంలో ఉండాలి
ఉద్యానవన పంటల్లో దేశంలోనే రాష్ట్రం ముందుండేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అరటి, మామిడి, నిమ్మ, ఆయిల్‌పామ్, కొబ్బరి, కాఫీ, టమోటా వంటి పంటల సాగులో దేశంలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నామని, రానున్న రోజుల్లో ఉద్యానవన పంటల్లో దేశంలో అగ్రగామిగా ఉండేదుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యానవన శాఖపై జరిగిన సమీక్షలో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వచ్చే రెండు మూడేళ్లలో ఉద్యానవన పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెంచి రైతులకు ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇందుకు గాను 2014-19 కాలంలో అమలు చేసిన ఉద్యానవన పంటల విధివిధానాలను పూర్తిగా అనుసరించాలని స్పష్టం చేశారు. 15 శాతం జీఎస్డీపీని సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయల కల్పన, మార్కెటింగ్, లాజిస్టిక్ సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజీలు, తక్కువ ఖర్చుతో రవాణా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2024-25లో లక్ష ఎకరాలను సూక్ష్మ సేద్యం కింద అదనంగా సాగులోకి తేవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించగా, ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో వంటి పంటల్లో మెరుగైన ఉత్పత్తి సాధించేందుకు సమగ్రమైన విధానాలు అవలంబించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించామని, దానిని ఆచరణ సాధ్యం చేసేందుకు వెంటనే తగిన ప్రయత్నం చేయాలని ఆదేశించారు. పుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఉత్తమ విధానాన్ని తీసుకొచ్చేందుకు నివేదక సిద్ధం చేయాలని చెప్పారు.
అనంతరం సహకార శాఖపై సమీక్ష జరగ్గా ఆ శాఖ కమిషనర్ ఎ.బాబు వివరిస్తూ ప్రసుత్తం రాష్ట్రంలో 13 డీసీసీబీలు ఉన్నాయని, ప్రతి జిల్లాకు ఒక డీసీసీబీని ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ప్రస్తుతం 24 పెట్రోల్ అవుట్ లెట్లు నిర్వహిస్తుండగా ఆయిల్ కంపెనీల నుండి మరో 64 ఎన్‌ఓసిలు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి-మత్స్య శాఖామాత్యులు కె.అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.