అమరావతి (చైతన్య రథం): ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వాములైన ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో.. నిలిచిపోయిన పనులపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలను ఆయా కంపెనీలతో చర్చించారు. సమావేశంలో మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ కంపెనీలు నిర్మాణం కోసం తీసుకొచ్చిన పరికరాలను తరలించేశాయి. దీంతో పూర్తయిన భవనాలు ముళ్లపొదలతో నిండిపోయాయి. మరికొన్ని అసంపూర్తిగా ఉండిపోయాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజధాని పునర్నిర్మాణంపై నిర్మాణరంగ కంపెనీలతో సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.