- దీపావళి నుంచే ఉచిత సిలిండర్ల పథకం
- పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల వెల్లడి
అమరావతి (చైతన్య రథం): కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాల అమలులో భాగంగా తొలి హామీని దీపావళినుంచి అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో సాగిన కేబినెట్ సమావేశం నిర్ణయించిందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఇ-క్యాబినెట్ భేటీలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మంత్రుల బృందం సంయుక్తంగా వెల్లడిరచారు. అందులో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ‘ఉచిత సిలిండర్ల పథకం’ అమలుపై కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకు అనుగుణంగా సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31న దీపావళి పండుగ నుంచి మూడు సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆరోజే సిలిండర్లను డెలివరీ చేస్తామని, ఇందుకై మూడు రోజుల ముందునుండే సిలిండర్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
పథకం అమలుకు ఏటా రూ.2,684 కోట్లమేర ఖర్చవుతుందన్నారు. సిలిండర్ల పథకం అమలుకు మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ప్రతి గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92లని, ఈ మొత్తం సొమ్ము రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలు అన్నింటికీ అందజేయడం జరుగుతుందని మంత్రి మనోహర్ వివరించారు. ఈ రాయితీ సొమ్మును డిబిబి ద్వారా లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు. డెలివరీ అయిన 48 గంటల్లోపే డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాకు జమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏటా మూడు దఫాలుగా పథకాన్ని అమలు చేస్తామని, ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుండి నవంబరు మరియు డిశంబరు నుండి మార్చి.. ఇలా మూడు బ్లాకుల్లో మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. పథకం అమల్లో సమస్యలుంటే తక్షణం పరిష్కరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి సూచనల మేరకు గ్రీవెన్సు రిడ్రెసల్ సిస్టమ్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి మనోహర్ వివరించారు. ‘ఉచిత సిలిండర్ల పథకం’ అమలుపై హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. దీపావళి పండుగ వారం ముందే వచ్చిందా? అనేలా మూడు సిలిండర్ల పంపిణీకి నిర్ణయించడం శుభపరిణామమన్నార.. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చారని గుర్తు చేశారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బందిపడే ఆడబిడ్డల కోసం నాడు కార్యక్రమం చేపట్టామని, సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తారని గుర్తు చేశారు. మూడు సిలిండర్లు ప్రభుత్వం ఇస్తోంది కనుక.. ఆ ఖర్చును మహిళలు తమ అవసరాలకు వాడుకోవచ్చన్నారు. ఇలాంటి పథకాలు పేదల జీవన ప్రామాణాలు పెంచడంలో భాగమవుతాయన్నారు. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.