చంద్రగిరి(చైతన్యరథం): పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఒకే నోటిఫికేషన్‌తో భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గురువారం యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. చంద్రగిరి యువగళం సభకు ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త, 30కిపైగా నూతన ఆవిష్కరణలు చేసిన డాక్టర్ పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువత అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ జవాబిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పెళ్లిచేసుకుందామనేది తన ఆలోచన అని, తనకు పెళ్లి యోగం ఉంటుందా అని ఒక యువకుడు అడగగా.. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.. నీ పెళ్లి అవుతుంది.. నన్ను కూడా పిలువు.. వస్తానని లోకేష్ అన్నారు.
చంద్రగిరి సభలో యువత ప్రశ్నలు-నారా లోకేష్ సమాధానాలు
డాక్టర్ పవన్, యాంకర్: పాదయాత్రలో అనేక సెల్ఫీలతో మీరు ఛాలెంజ్ లు విసిరారు. రోడ్లపై అనేక గుంతలు కనిపించాయి. ఇప్పుడున్న ప్రభుత్వం వేలకోట్ల రూపాయులు ఖర్చుచేసి రోడ్లు నిర్మించాం, అనేక పరిశ్రమలు తెచ్చామంటోంది. దీనిపై మీరు ఏం సమాధానం చెబుతారు?
నారా లోకేష్: కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు ఉన్నాయంటే అవి తెలుగుదేశం హయాంలో వేసినవే. డ్రైయిన్లు నిర్మించామంటే అది తెలుగుదేశంలోనే. చిత్తూరు జిల్లాకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్.. కోడి ముందా, గుడ్డు ముందా అని చెబుతారు. మనల్ని అందరూ హేళన చేస్తున్నారు. అందుకే ఆయనకు కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టాం.
వెంకట్: నేను బీటెక్ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. ఏటా జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. ఐదేళ్లు ఎదురుచూశాను. జాబ్ లేదు, జాబ్ కేలండర్ లేదు, పెళ్లి లేదు. ఇప్పుడు జగన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ఆ హామీనే ఇవ్వలేదు. నాకు పెళ్లి జరిగే యోగం మీ చేతిలోనే ఉంది. మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? ఇక్కడ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకురావాలి.
నారా లోకేష్: మా తొలిసంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. మేం వచ్చిన తర్వాత సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం. నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. నీ పెళ్లికి పిలువు.. తప్పకుండా వస్తా. చెవిరెడ్డిని ఓడిరచండి.. చంద్రగిరికి పరిశ్రమలు తీసుకువస్తా.
నవీన: జగన్ రెడ్డిపై గులకరాయి దాడిచేసింది మీరేనని వైసీపీ చెబుతోంది. దానిపై మీ స్పందన ఏమిటి? ఆ రాయితో చీమ కూడా చావదు.
నారా లోకేష్: అది స్పెషల్ గులకరాయి. ఇంపోర్టెడ్. ఎవరో వేశారంటా.. ముఖ్యమంత్రికి తగిలిందంటా. దాడులను ఎవరూ ప్రోత్సహించరు. రాయి కాస్తా సీఎంకు తగిలి, తర్వాత వెల్లంపల్లి కుడి కన్ను, తర్వాత ఎడమ కన్నుకు తగిలిందంటా. ఒక రోజు వెల్లంపల్లి కుడి కన్నుకు కట్టు కట్టారు. తర్వాత ఎడమ కన్నుకు కట్టారు. కోడికత్తి డ్రామా చూశాం. 15 రోజుల తర్వాత బాబాయి శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి డ్రామా. ఇప్పుడు నా భయం ఏ శవం బయటకు వస్తుందోనని. ఇటీవల యూట్యూబ్ లో ఓ వీడియో చూశా. జగన్ రెడ్డి తన తల్లిని ఇంటికి రమ్మంటే.. లేదు.. నేను బహిరంగ సభలకే వస్తానని చెబుతారు. షర్మిల కూడా ఇదే విధంగా సమాధానం ఇస్తారు. సొంత తల్లి, చెల్లి జగన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. ఇక మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించాలి. తల్లి, చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదు. ఇక మన ఆడపడుచులు ఏవిధంగా నమ్ముతారు?
డాక్టర్ పవన్, యాంకర్: ఐదేళ్లకు ముందు సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని వస్తుందని నమ్మా. ఆ కల ఇప్పటికీ కలగానే ఉంది. ఎప్పుడు నెరవేరుతుంది?
నారా లోకేష్: జగన్ రెడ్డి మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. రాజధానుల విషయంలో ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు చేశారు. కర్నూలు, విశాఖలో ఒక్క ఇటుక వేయలేదు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి విశాఖలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ 550 కోట్లు ఖర్చుపెడితే ఎంతోమంది పేదలకు ఇళ్లు, పరిశ్రమలు, యువకులకు ఉద్యోగాలు వచ్చేవి. మేం వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభించి పూర్తిచేస్తాం.
జయచంద్ర: మన రాష్ట్రంలోనే ఐటీ ఉద్యోగాలు కల్పించాలి,
నారా లోకేష్- టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వంలో విశాఖకు ఐటీ పెట్టుబడులు తీసుకువస్తాం. గతంలో నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు జోహోను తిరుపతికి తీసుకువచ్చా. ఒక నెల ఓపికపట్టండి. కోడిగుడ్డు మంత్రి శాశ్వతంగా ఇంటికి వెళ్తారు. ఐటీ పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకువచ్చే బాధ్యత మాది.
డాక్టర్ పవన్, యాంకర్: పుష్ప ప్లేస్ మార్చారు, దీనిపై మీ స్పందన ఏంటి?
నారా లోకేష్: అల్లు అర్జున్ తో ఈయనకు పోలిక లేదు. ఐదేళ్లు కనిపించలేదు. తిరుమల టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారు. వారి బంధువులు గంజాయి అమ్మి చంద్రగిరిలో డబ్బులు సంపాదిస్తున్నారు. వేలాది మంది గంజాయికి బానిస అయ్యారు. చంద్రగిరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ తల్లి తన పెద్దకూతురు గంజాయికి బానిసైందని, సీఎంసీ వెల్లూరు ఆసుపత్రికి రిఫర్ చేయాలని కోరారు. మీరు సాయం చేయలేకపోతే తన ఇద్దరు కూతుర్ల కోసం పెద్ద కూతురును చంపేస్తానని చెప్పారు. దీనంతటికి కారణం చెవిలో పూలు పెట్టే చెవిరెడ్డి.
చిరంజీవి: ఏపీలో ఏకైక సమస్య మద్యం. ఉద్యోగం, వ్యాపారం చేసే వారు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు మందుతాగే పరిస్థితి లేదు. మద్యం విషంగా మారింది. పోలీసుల భయంతో ఎక్కడా తాగలేని పరిస్థితి. జూన్ 4న కొత్త పరిస్థితి వస్తుందా?
నారా లోకేష్: మద్యం ఆరోగ్యానికి హానికరం. 9 గుర్రాలు, 3 క్యాపిటల్స్ అన్ని పిచ్చి బ్రాండ్లను తరిమివేస్తాం. పాత మద్యం విధానం తీసుకువస్తాం. మద్యం నియంత్రిస్తాం. షాపుల సంఖ్య తగ్గిస్తాం. ఆసుపత్రుల వద్ద మద్యం దుకాణాలు తెరిచింది ఈ ప్రభుత్వం. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ మద్యం విషం కన్నా చాలా ప్రమాదకరం. క్వాలిటీ మద్యం తీసుకువస్తాం.
యువకుడు: మా చెల్లెలు భర్తను వదిలేసి సింగిల్‌గా ఉంటోంది. ఇల్లు కావాలని అడిగితే జాగా చూపించమంటున్నారు. మద్యం దుకాణాల్లో స్పిరిట్ అమ్ముతున్నారు. పోలవరం వస్తే లక్షలాది మంది రైతులకు సాగునీరు అందుతుంది. 80శాతం చంద్రబాబు పూర్తిచేశారు. మిగిలిన 20శాతం జగన్ రెడ్డి ఎందుకు పూర్తిచేయలేకపోయారు?
నారా లోకేష్: ఆ స్పిరిట్ తాగితే దేవుడి వద్దకు వెళ్తారు. ఏపీకి జీవనాడి పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తైతే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. రాయలసీమలో హంద్రీనీవాను 90శాతం మేం పూర్తిచేస్తే, జగన్ రెడ్డి 10 శాతం కూడా చేయలేదు. దీంతో తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది ఏర్పడిరది. మేం వచ్చిన తర్వాత హంద్రీనీవా పూర్తిచేస్తాం. పోలవరం పెండిరగ్ పనులు కూడా పూర్తిచేస్తాం. సిమెంట్ ధరలు, స్టీల్, ఇసుక ధరలు పెరిగాయి. దీంతో పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి. మెరుగైన టెక్నాలజీతో ఇళ్లు కట్టించి, పేదలకు ఇంటి తాళాలు అందించే బాధ్యత మాది.
యువకుడు: నేను గతేడాది పదో తరగతి చదివాను. సోషల్‌లో జీడీపీ గురించి వచ్చింది. రాష్ట్రంలో జీడీపీ పెరుగుదల రేటు ఆశాజనకంగా లేదు. జీడీపీ పెంచేందుకు మీరేం చేస్తారు?
నారా లోకేష్: జీడీపీ పెరగాలంటే ప్రజల ఆదాయం పెరగాలి. చిత్తూరుకు రోడ్డు వేస్తే అవసరమా అన్నారు. ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. భూముల ధరలు పెరిగాయి. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు వస్తాయి. దీంతో ప్రజల ఆదాయం పెరుగుతుంది. తద్వారా జీడీపీ పెరుగుతుంది. పోర్టులు, పరిశ్రమలు, తీరప్రాంత అభివృద్ధి ద్వారా ట్రిలియన్ డాలరీ ఎకానమీకి తీసుకురావచ్చు.
యువకుడు: డిగ్రీ పూర్తిచేసిన వారు ఉద్యోగాలు లేక జొమాటో, స్విగ్గీలో పనిచేస్తున్నారు. పీజీ చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మేం పొరుగు రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్యోగాలు కల్పించాలి. ఐదేళ్లు నష్టపోయాం. ఇప్పుడు నా రెజ్యూమ్‌లో ఏమని పెట్టాలి?
నారా లోకేష్: జగన్ వల్ల నష్టపోయామని రెజ్యూమ్‌లో పెట్టాలి. గతంలో మనం అనేక ఉద్యోగాలు కల్పించాం. పరిశ్రమల ద్వారా చిత్తూరు జిల్లాలో 50వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. రేపు మన చిత్తూరు కేంద్రంగా పెట్టుబడులు తీసుకువస్తాం. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. చెవిలో పూలు పెట్టే చెవిరెడ్డిని గెలిపిస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు రావు.
అఖిల: పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుంది? స్టార్టప్‌లకు ఎలా సాయం అందిస్తారు?
నారా లోకేష్: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీసీఎస్, కియా, జోహో, ఫాక్స్‌కాన్, సెల్‌కాన్ వంటి పరిశ్రమలు వచ్చాయి. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వమే చెప్పింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తాం. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంక్యుబేటర్ పెట్టాం. యువతీ యువకులకు ఐడియాలు ఉంటే అండగా నిలిచాం. యువతే ఉద్యోగాలు కల్పించే విధంగా చేస్తాం.
చంద్ర:
విద్యావ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకువస్తారా?
నారా లోకేష్: కేజీ నుంచి పీజీ వరకు విద్యను ప్రక్షాళన చేస్తాం. మహిళలపై నేడు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. మహిళలను గౌరవించే విధంగా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువస్తాం. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండేది. నేడు వసతి దీవెన, విద్యాదీవెన అంటూ నగదు జమచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం తీసుకువస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం పునరుద్ధరిస్తాం
భవిత: నేను విదేశాల్లో చదువుకుని వచ్చాను. విదేశీ విద్య ఉందనే ధైర్యంతో వెళ్లాం. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత విదేశీ విద్య నిధులు రాలేదు. ఆగిపోయిన నిధులు మీరు పునరుద్ధరిస్తారా? ఎన్నికల ప్రచారంలో మోహిత్ రెడ్డి వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. తాగునీటి సమస్య ఉందని చెబితే.. ఇప్పటివరకు కన్నెత్తి చూడలేదు. విదేశీ విద్య గురించి అడిగితే అదొక పనికిమాలిన స్కీమ్ అని హేళనగా మాట్లాడారు.
నారా లోకేష్: మనకు ప్రిజనరీ ముఖ్యమంత్రి ఉన్నారు. జగన్ రెడ్డికి విజనరీ లేదు. మొన్నొక ఇంటర్వూలో అమరావతిలో ఏముంది, ఖాళీ భూమే కదా అన్నారు. సైబరాబాద్ లో ఒకప్పుడు ఉంది రాళ్లు రప్పలే. చంద్రబాబువిజన్ తో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. 15 లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. సైబరాబాద్ లో ఎకరా 100 కోట్లకు విక్రయించారు. విజనరీ నాయకుడు చంద్రబాబు అయితే ప్రిజనరీ నాయకుడు జగన్ రెడ్డి. మోహిత్ రెడ్డిది అవగాహనారాహిత్యం. విదేశీ విద్య బకాయిల చెల్లింపుపై పరిశీలించి హామీ ఇస్తాం. విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తాం.
యువకుడు: చంద్రబాబు విజనరీ లీడర్. రేపు చంద్రబాబు లెగసీని మీరు కంటిన్యూ చేస్తారా? మీకంటూ కొత్త బ్రాండ్‌ను క్రియేట్ చేస్తారా?
నారా లోకేష్: నాది యువగళం. దబిడిదిబిడే. పాదయాత్రలో నా శైలి మీకు అర్థమైంది అనుకుంటా. నేను స్టాన్‌ఫోర్డ్ లో చదివి ఐదేళ్లు ప్రైవేటుగా పనిచేసి తర్వాత సేవ చేసేందుకు ప్రజాజీవితంలోకి వచ్చా. కష్టపడ్డా. 2019లో ఓటమి చెందా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. ఆ రోజు నుంచి ప్రజల తరపున పోరాడా. నాపై 23 కేసులు పెట్టారు. అయినా మీ లోకేష్ తగ్గేదే లేదు అని చెప్పా. బాంబులకే భయపడని కుటుంబం మాది. ఈ చిల్లర కేసులు భయపడతామా? సింహంతో ఆడుకుంటున్నావని జగన్ రెడ్డికి చెప్పా. 53 రోజులు చంద్రబాబును జైల్లో బంధించారు. ఆ సింహం నీతో ఆటాడుకుంటుంది.
యువకుడు: నేను చెవిరెడ్డి అల్లుడిని. తుమ్ములగుంట చెరువును కబ్జా చేసి స్పోర్ట్ క్లబ్ నిర్మించారు. మాకు తాగునీటి సమస్య ఉంది. మీరు వస్తే చెరువును నీటితో నింపుతారా?
నారా లోకేష్: చెరువు చెరువే. అది చెరువు అని తేలితే నీటితో నింపుతాం. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం.
రవి: కర్నూలు బాగా వెనుకబడి ఉంది. ఇప్పటికీ వలసలు ఉన్నాయి. దీనిని కట్టడిచేయాలి. డీఈడీ పాసైన తర్వాత ఒక్క డీఎస్సీ లేదు. పోస్టులు పెంచుతారా?
నారా లోకేష్: నంద్యాలకు, కర్నూలుకు చాలా తేడా ఉంది. నంద్యాల సస్యశ్యామలంగా ఉంది. కర్నూలు నుంచి వందలమంది వలసలు వెళ్తున్నారు. అందుకే కర్నూలు పార్లమెంట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు చేపడతాం. ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంది. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. సింగిల్ జాబ్ కేలండర్ ద్వారా అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
ప్రసన్న: గత 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నా. ఉద్యోగం పర్మినెంట్ చేస్తారా? అసలు కాంట్రాక్టు పద్ధతినే తీసేయాలని మా మనవి.
నారా లోకేష్: కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణ విషయంలో పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాం.
పార్థు: టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ వారికి కార్పొరేషన్ ద్వారా కార్లు, జేసీబీలు అందజేశారు. వైసీపీ వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేశారు. మీరు వచ్చాక మళ్లీ పునరుద్ధరిస్తారా?
నారా లోకేష్: చంద్రబాబు హయాంలో దామాషా ప్రకారం కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించాం. ఇన్నోవాలు, జేసీబీల కొనుగోలుకు సబ్సిడీలు ఇచ్చి అండగా నిలిచాం. ఇప్పుడు అన్నీ రద్దు చేశారు. రేపు ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించి, కార్పొరేషన్లకు నిధులు కేటాయించి ఖర్చుచేస్తాం.
యువకుడు:
టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు. రేపు కూడా తీసుకువస్తారనే నమ్మకం ఉంది. చంద్రగిరికి మీరు వచ్చిన తర్వాత భగభగమండే సూర్యుడు కూడా చల్లబడిపోయాడు. ఇక్కడికి వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. పులివర్తి నాని వంటి నాయకుడిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రగిరిలో వైసీపీ కూటమిని బద్దలు కొట్టి టీడీపీని గెలిపిస్తాం.