అమరావతి(చైతన్యరథం): భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన రెండు తెలుగు రాష్ట్రాల ముంపు బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తూ ఉదారతను చాటుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు తెలుగు చిత్ర సీమకు చెందిన వారు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్‌టీఆర్, మహేష్ బాబు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ తదితరులు వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించా. తాజాగా హీరోలు చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.
ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో రూ. కోటి ఇవ్వనున్నట్లు పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలచివేస్తున్నాయని చిరు ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతుగా కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను.
అలాగే అల్లు అర్జున్ కూడా రెండు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ కష్ట సమయం తొలిగిపోయి, రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇదేనని రామ్ చరణ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపిరూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు (రూ. 50 లక్షల చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు సినీ ప్రముఖుల విరాళాలు..
పవన్ కళ్యాణ్: ఏపీకి రూ. 5 కోట్లు, తెలంగాణకు రూ. కోటి
ప్రభాస్: ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి
చిరంజీవి: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
బాలకృష్ణ: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
మహేష్ బాబు: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
రామ్ చరణ్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
ఎన్టీఆర్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అల్లు అర్జున్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
వైజయంతీ మూవీస్: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 20 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
విశ్వక్ సేన్: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
వెంకీ అట్లూరి(దర్శకుడు): ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అనన్య నాగళ్ల: ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు
యాంకర్ స్రవంతి చొక్కారపు: ఏపీకి రూ. లక్ష, తెలంగాణకు రూ. లక్ష
బన్నీ వాస్: ‘ఆయ్’ సినిమా ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
కోట శ్రీనివాసరావు: ఏపీకి రూ. లక్ష
అలీ: ఏపీకి రూ. 3 లక్షలు, తెలంగాణకు రూ. 3లక్షలు