- సురక్షితంగా దిగిన తొలి టెస్ట్ ఫ్లైట్
- కల నిజమయిందంటూ పులకించిన ఉత్తరాంధ్ర
- భవిష్యత్తును మార్చే వెలుగురేఖ అంటూ సంబరాలు
- 96 శాతం పనులు పూర్తి
- జూన్ నుంచి ప్రజలకు అందుబాటులోకి
భోగాపురం (చైతన్యరథం) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. ఆకాశం నుంచి లోహ విహంగం దిగుతుంటే ఉత్తరాంధ్ర మొత్తం పులకరించిపోయింది. అది మామూలు విమానం కాదు.. మన ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును, మన తలరాతను మార్చే వెలుగు రేఖ అంటూ సంబరపడింది. ఆదివారం ఉదయం 10:15 గంటలకు వ్యాలిడేషన్ (టెస్ట్) ఫైట్గా ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి వచ్చి భోగాపురం విమానాశ్రయంలో దిగింది. నూతనంగా నిర్మించిన రన్వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తరుణంలో అక్కడ హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్ తో ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో అధికారుల పర్యవేక్షణలో ట్రయల్ ల్యాండింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ చారిత్రక వేడుకను వీక్షంచేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేగంగా పనులు పూర్తి చేసి, గడువు కంటే ముందే వ్యాలిడేషన్. ఫ్లైట్ నిర్వహించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్, తదితరులు ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినట్లు నిర్మాణ బాధ్యతలు చూస్తున్న జీఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
సీఎం చంద్రబాబు దూరదృష్టికి ప్రతిరూపం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విమానం ల్యాండ్ అయిన సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ల్యాండ్ అవుతున్నాం అని విమానంలో ప్రకటన విన్న వెంటనే మనసు ఉప్పొంగిపోయిందన్నారు. ఎంతో ఉద్విగ్నభరితమైన క్షణాలను అనుభవించానని తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టికి ప్రతి రూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని వ్యాఖ్యానించారు. మరో నాలుగైదు నెలల్లో విమానాశ్రయం ప్రారంభించేందుకు సంకల్పం తీసుకున్నాం. విమానాశ్రయానికి సంబంధించి కీలక అంశాలన్నీ పూర్తయ్యాయి. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే ప్రాజెక్టు చివరి దశ సహా అన్నీ పూర్తిచేసినట్లు సంకేతం. ఈ ప్రాజెక్టుతో వివిధ జిల్లాల ప్రజలు అనుసంధానం అవుతారు. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉందే. విమర్శలకు సమాధానంగా విమానాశ్రయాన్ని నిర్ణీత గడువుకు ముందే నిర్మించాం. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖ ఎకనామిక్ రీజియను కేంద్ర బడ్జెట్లోనూ నిధుల కేటాయింపు చేపట్టారు.
మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకుంటున్నాం. 96 శాతం విమానాశ్రయ పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎయిర్పోర్టు అంటే 2 వేల ఎకరాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు. విశాఖ ఎకనామిక్ రీజియన్ బలపడడానికి అవకాశం లభిస్తుంది. 18 నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించాం. జీఎంఆర్, మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నాయని వివరించారు. ఏరోస్పెస్ ఎడ్యుసిటీతో అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
జగన్ హయాంలో సాగని పనులు
భోగాపురం విమానాశ్రయ నిర్మాణం తమ ప్రభుత్వ ఘనతేనంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు. వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ముందుకు సాగలేదన్నారు. వైసీపీ హయాంలో 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని నిరంతరం పర్యవేక్షించటంతో భోగాపురం పనులు 96 శాతం పూర్తయి టెస్ట్ రను సిద్ధమయిందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
భోగాపురం ఎయిర్పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వీతో ఈ విమానాశ్రయం రూపొందించబడింది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్ఆఫ్ సదుపాయం ఉండటం దీని ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరగడంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దుతున్నారు.















