- పర్యాటక రంగంలో ఎన్డీయే ప్రయోగాలు
- టూరిజానికి పరిశ్రమ హోదానిచ్చే ప్రయత్నం
- నేడు విజయవాడ -శ్రీశైలం మధ్య ‘సే ప్లేన్’
- పున్నమిఘాట్‌లో ఆవిష్కరించనున్న చంద్రబాబు
- అదే ప్లేన్‌లో శ్రీశైలానికి ప్రయోగాత్మక ప్రయాణం
- త్వరలో రెగ్యులర్ సర్వీస్ నడిపేలా చర్యలు
- విజయవంతమైన ట్రయల్ రన్..
- బీచ్ ఫెస్టివల్స్‌తో బీచ్ టూరిజంపైనా దృష్టి
- 20 శాతం ఉద్యోగాల కల్పనకు సర్కారు యోచన
అమరావతి (చైతన్య రథం): ఏపీ టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించి.. ప్రయోగాత్మక చర్యలతో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెస్తానని మఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. గత సెప్టెంబరు 27, ప్రపంచ పర్యాటక దినోత్సవాన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా ఒక్కో అడుగూ పడుతోంది. ఐదేళ్ల వైసీపీ అసమర్థ పాలనలో నిర్వీర్యమైన పర్యాటక రంగానికి జవసత్వాలు అందించి.. అద్భుత విజయాలు అందుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికా రచనలో నిమగ్నమైంది. ఐదేళ్ల పాలనాకాలంలో రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఎన్డీయే సర్కారు.. సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటుంది. అందులో భాగంగానే `ఏపీ టూరిజంలో విప్లవాత్మక నిర్ణయాలు, ప్రయోగాలకు శ్రీకారం చుడుతుంది. ఇందులో భాగంగానే `పర్యాటక రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు విజయవాడ పున్నమి ఘాట్ వేదికైంది. విజయవాడ నుంచి శ్రీశైలంమధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగాన్ని ఎన్టీయే సర్కారు నేడు ఆవిష్కరిస్తోంది. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. విజయవాడ- శ్రీశైలం- విజయవాడ మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలన్నది సర్కారు ఆలోచన. కృష్ణానదిలో పున్నమిఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి సర్వాంగ సుందరంగా మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడినుంచే సీ ప్లేన్ శనివారం బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది. ఇది శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద దిగేందుకు త్కాలిక ఏర్పాట్లు చేశారు.
ట్రయల్ రన్ సూపర్ సక్సెస్..
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ‘సీ ప్లేన్’ను ఆవిష్కరించనున్న నేపథ్యంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ- శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి చేరుకుంది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
కూటమి ప్రభుత్వంలో సరికొత్త ప్రయోగాలు
ఏపీని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పలు ప్రయోగాలు నిర్వహిస్తోంది. ప్రణాళికలు రూపోందిస్తోంది. కొద్దిరోజుల క్రితమే `జాతీయస్థాయి డ్రోన్ సమిట్ నిర్వహించి.. గిన్నెస్ రికార్డులు కైవసం చేసుకుంది. ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి `టూరిజం సెక్టార్‌లో అద్భుతాలు సాధించవచ్చన్న ప్రణాళికలు మునుపటి చంద్రబాబు హాయంలోనే రూపుదిద్దుకున్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో బలమైన ప్రణాళిక రూపుదిద్దుకున్నా.. తర్వాత గద్దెనెక్కిన వైసీపీ సర్కారు ఆ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లలేదు. సరికదా.. ఉన్న వ్యవస్థను, అద్భుత అవకాశాలనూ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో `సమీప భవిష్యత్‌లో పర్యాటక రంగంలో అద్భుత విజయాలు సాధించే దిశగా అడుగులేస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ‘సీ ప్లేన్’ ప్రయోగం చేస్తున్నాయి. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా ‘సీ ప్లేన్’ ప్రోగ్రాం రూపొందిస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే.. దీన్ని రెగ్యులర్ సర్వీస్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. శనివారం ఆవిష్కృతమవుతున్న ప్రయోగాన్ని విజయవంతం చేసి.. భవిష్యత్‌లో విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ‘సీ ప్లేన్లు’ తిప్పాలన్నది ప్రభుత్వ ఆలోచన. మలి దశలో ఆయా ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు ఉండొచ్చని సంబంధిత అధికార్లు అంటున్నారు.
విస్తృతంగా రాయితీలు అందించడం ద్వారా `పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించలన్నది ప్రభుత్వ యోచన. టూరిజం అంటే కేవలం ప్రాంతాల సందర్శనే కాదు, అదొక అన్వేషణ. మనశ్శాంతి..ఉత్తేజం.. ఒక అనుభవం కూడా. దైనందిన జీవితంలో మనిషికి ఎదురవుతున్న వత్తిడిని జయించడానికే పర్యాటక ప్రాంతాలను వెతుక్కుంటున్నాడు. ఇందుకోసం భారతీయులు లక్షల కోట్లు ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్తున్నారు. వాళ్లతోపాటు ఆదాయం సైతం ఆయా దేశాలకు తరలిపోతోంది. అదే మన దేశంలో పర్యాటక రంగానికి అనువైన పరిస్థితులు కల్పిస్తే ఆదాయం మనకే దక్కుతుంది. ఇంతవరకు సోషలిజం.. కమ్యూనిజం.. లాంటివాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడిక టూరిజం గురించి మాట్లాడదాం. టూరిజం ద్వారా హోటళ్లు, ట్రావెల్స్ తదితర రంగాల్లో ఇతోధికంగా ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగమే `టూరిజం. దేశంలో టూరిజంవల్ల జీడీపీలో 6.5 శాతం ఆదాయం వస్తుంటే, మన రాష్ట్రంలో 7.1 శాతం ఆదాయం లభిస్తోంది.
రాష్ట్రంలో అపార తీరప్రాంతం, సహజ వనరులు, నదులు, చరిత్ర, సంస్కృతి, ప్రాచీన ఆలయాలు, బౌద్ధ ఆరామాలు, 13 వన్య ప్రాణ అభయారణ్యాలు, మూడు జాతీయ పార్క్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించేవే. ప్రపంచస్థాయి పర్యాటకాన్ని ఆకర్షించే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వంచర్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ టూరిజం.. ఇలా విభిన్నరకాల టూరిజం అట్రాక్షన్‌లపై దృష్టి సారిద్ధాం. అరకు, లంబసింగి, పాపికొండలు, దిండి, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంభాలకొండ, కోనసీమలాంటి అందాలను మార్కెటింగ్ చేసుకోగలిగితే.. టూరిజం సెక్టార్ రాష్ట్రానికి వెన్నెముక అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అలాగే బీచ్ టూరిజం అభివృద్ధి చేసి బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రానికి మంచి ఆదాయం రాకపోదు. వాటర్ స్పోర్ట్స్, సీ ప్లేన్‌ల ఏర్పాటు ఎన్నో అవకాశాలు. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం తదితర బీచ్‌లలో బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నాం. హార్స్‌లీ హిల్స్, లేపాక్షి, గండికోట తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో ఏపీ టూరిజాన్ని టాప్ టూరిజంగా విజయాలు సాధిద్ధాం. ప్రపంచ టూరిస్ట్‌లు ఏపీవైపు పరుగులు తీయాలంటే.. మనలోనూ మార్పు రావాలి. మోసం చేసే ఆలోచన కనీసం దగ్గరకు రానివ్వొద్దు. మనింటికి గెస్ట్‌వస్తే ఎలా ఆతిధ్యమిస్తామో, మన ప్రాంతానికివచ్చే టూరిస్ట్‌లను అలా ఆదరించనప్పుడే పర్యాటక రంగం అభివృద్ధి సాధ్యం. టూరిజం ద్వారా మొత్తం ఉపాధి కల్పనలో కనీసం 20 శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది.