- రైతులకు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలి
- భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాలి
- పాడి, ఆక్వా రంగాలకు ప్రాధాన్యమివ్వాలి
- వ్యవసాయం రంగం సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో సహజ సాగును మరింతగా విస్తరించి అద్భుత విజయాలు సాధిద్దామని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ శాఖను సమీక్షించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. గతంలో ప్రకృతి సాగును ప్రోత్సహించామంటూనే, ఈసారి 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయని, హైప్రొటీన్స్‌కు జనం ప్రాధాన్యం ఇస్తుండటంతో డిమాండ్ ఉంటోందన్నారు. గతంలో పామాయిల్, కోకో పంటలు తెచ్చామని, ఇప్పుడు హార్టికల్చర్‌లో అధిక ఉత్పత్తులు చూస్తున్నామన్నారు.
మామిడి, అరటి, డ్రాగన్ క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ ఫ్రూట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కేంద్రం కూడా క్లస్టర్ విధానం తీసుకొస్తోందని అంటూనే, హార్టికల్చర్, అగ్రికల్చర్ విధానంలో మరిన్ని మార్పులు తేవాల్సి ఉందన్నారు. పాల డైరీలు వ్యవసాయ భూమి లేనివారికి ఆదాయం పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతందని అన్నారు. నరేగా ద్వారా నిధులు కేటాయించి ఫామ్ నిర్మించుకోవడానికి ప్రోత్సాహమివ్వాలి. సంక్షేమ కార్యక్రమాలతోపాటు అదనపు ఆదాయం రావడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు అందించాలని కలెక్టర్లకు సూచించారు.
2014-19 మధ్య రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి ఉచితంగా పోషకాలు అందించాం. కానీ గత ప్రభుత్వం అన్నింటినీ మరుగున పడేసింది. చేపలకు ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ చేపలను ఆహారంలో తీసుకుంటున్నారు. మరింత ప్రమోట్ చేయాలని సూచిస్తూ.. కిందిస్థాయిలో చెరువులు అప్పగించి చేపల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించడానికి అవకాశం ఉందన్నారు. ప్రజల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని, ఇన్‌పుట్, బీమా, మార్కెట్ లింకింగ్ కల్పించాలన్నారు. అడవుల విస్తీర్ణం పెంచాలంటూనే, హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు చల్లి మొక్కలు పెంచామన్నారు. పారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో మంచి అధికారులు ఉన్నారు.
అడవులు పెంపకంపై దృష్టి పెట్టాలి. వనమహోత్సవం నిర్వహించి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాం…మళ్లీ అలాంటి కార్యక్రమాలు రావాల్సి ఉందన్నారు. వ్యవసాయంలో డ్రోన్ ఎంత మేర ఉపయోగించారో చూడాలి. వ్యవసాయంలో డ్రోన్ విధానం తీసుకొస్తే ఉపాధి అవకాశాలు కూడా తీసుకురావొచ్చు. సాగుకు అయ్యే ఖర్చును తగ్గిస్తే రైతులకు నష్టాలు నివారించగలుగుతాం. అన్ని శాఖలూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు.