- మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు
- ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని డైలీవేజ్ వర్కర్ల విన్నపం
- ఆట స్థలం కోసం విడిచి పెట్టిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేతలు
- వివిధ సమస్యలపై పోటెత్తిన అర్జీదారులు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన నేతలు
అమరావతి(చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అండదండలతో ఆ పార్టీ నాయకులు బొగ్గరం మూర్తి అతని అన్న నరసింహకుమార్‌లు నరసరావుపేట పట్టణం స్టేషన్ రోడ్డులోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేయడానికి తెచ్చిన ధ్వజస్తంభం, దానికి సంబంధించిన తొడుగులు, ఇత్తడి సమాన్లు అమ్ముకున్నారని టీడీపీ నేతలకు సూలం రమేష్ ఫిర్యాదు చేశారు. గుడి దేవాదాయ శాఖ పరిధిలో ఉందని.. గుడి పునర్నిర్మాణానికి నిధులు ఖర్చుపెట్టినందుకు తన పేరు మీద శిలాఫలకం వేయిస్తే దాన్ని పగలగొట్టి గుడిలోకి వెళ్లకుండా తనను కొట్టి అక్రమ కేసులు పెట్టి తననే జైలుకు పంపారని వాపోయాడు. దీనికి సంబంధించి సాక్ష్యాలు, వీడియోలు కూడా ఉన్నాయని, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు సూలం రమేష్ సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యంలకు వినతి పత్రం ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. వినతి స్వీకరించిన నేతలు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కె. అబ్దుల్ రహిమాన్ అర్జీని ఇస్తూ.. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాయచోటిలోని 31వ వార్డుకు కౌన్సిలర్‌గా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రం తీసుకొని వెళితే సంబంధిత అధికారి ముందే వైసీపీ నేతలు నామినేషన్ పత్రాన్ని చించి తనను కొట్టారని పోలీసులు పక్కనే ఉన్నా చూస్తూ ఉండిపోయారని ఫిర్యాదు చేశారు. మళ్లీ ఎలక్షన్ నిర్వహించమని కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో 2021 మార్చిలో నామినేషన్ వేయాలంటూ కలెక్టర్ ద్వారా నోటీసు వచ్చిందన్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వైసీపీ నేతలు తనను కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా చేశారన్నారు. న్యాయం చేయాలని టీడీపీ నేతలను వేడుకున్నారు.
అద్దంకి మండలం అద్దంకి గరటయ్య కాలనీకి చెందిన మానం నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. తన పొలంలో తుమ్మ చెట్లను యర్రా హనుమంతరావు అనే వ్యక్తి నరికేయగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదన్నారు. దీంతో పొలంలో ఉన్న సుబాబులు, జామాయిల్ చెట్లను కూడా రాత్రికి రాత్రి ధ్వంసం చేశారని.. ఇదేమిటని నిలదీస్తే.. పొలం దగ్గరకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తన భూమిని కొట్టేసేందుకు యత్నిస్తున్నాడని.. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో 347 మంది డైలీవేజ్ వర్కర్స్‌ను ఆప్కాస్‌లో చేర్చాలని సంక్షేమ శాఖ నుండి ఈ ఏడాది మార్చిలో ఉత్తర్వులు వెలువడినా, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఐదు నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నామని, జీతాలు అందించి న్యాయం చేయాలని డైలీవేజ్ వర్కర్స్ వేడుకున్నారు.
టీడీఆర్ బాండ్లు నిలిపివేయుటంతో టీడీఆర్ ఫ్లోర్ రిలాక్సేషన్ తీసుకునేందుకు అవకాశం లేనందున ప్లాన్ తయారీ, భవన నిర్మాణానికి అవకాశం లేకపోవడంతో బిల్డర్స్ దగ్గర పనిచేస్తున్న కాంట్రాక్ట్ మేస్త్రీలు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్‌తో పాటు 18 రకాల చేతి వృత్తులవారు జీవనాధారం కోల్పోతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డెవలపర్ శ్రీహరి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
తనకు తెలియకుండా తన భూమిని వేరొకరికి విక్రయించారని.. దానిపై తహశీల్దార్ వద్దకు వెళ్లి అడగ్గా.. పట్టించుకోవడంలేదని ఏలూరుకు చెందిన కత్తుల రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
తన పొలం 0.44 సెంట్ల కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగి తమకు న్యాయం చేయాలని అడిగితే అధికారులు పట్టించుకోవడంలేదని.. కోర్టుకు వెళ్లమని సలహాలు ఇస్తున్నారని.. అధికారులు ఇప్పటికీ వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని.. దాదాపు రూ. కోటి విలువ చేసే స్థలం అని.. తమకు న్యాయం చేయాలని కదిరి మండలం యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఉత్తేమ్మ గ్రీవెన్స్‌లో టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్ రహీమ్ విజ్ఞప్తి చేస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల మధ్య పేదల బడి, ఆట స్థలాల కోసం విడిచి పెట్టిన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారని… ప్రభుత్వ స్థలం అని పెట్టిన బోర్డును తొలగించి మరీ కబ్జా చేశారని వారి కబ్జా నుండి ఆ స్థలాన్ని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. అలాగే రాయచోటిలోని ఇందిరమ్మకాలనీకి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ.. తమ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వేడుకున్నారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతాపురం గ్రామానికి చెందిన మండవ అంజయ్య విజ్ఞప్తి చేస్తూ.. దొడ్డవరం గ్రామానికి చెందిన కావూరి అంకమ్మరావు తన వ్యవసాయ భూమిని ఆక్రమించుకుని బెదిరిస్తున్నాడని.. అడిగితే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానంటున్నాడని.. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
మండల కేంద్రం మార్టూరు కిశోర్ కాలనీకి చెందిన బుడబుక్కల సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు విజ్ఞప్తి చేస్తూ.. తమ కాలనీలో సైడ్ కాలువలు, రోడ్లు, వీధి లైట్లు వేయాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని వేడుకున్నారు.
రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో సర్పంచ్‌గా అధికారం దక్కించుకున్న కరణం సత్తిబాబు ఓసీ అని, అతని తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కాళ్ల సర్వేశ్వరావు అర్జీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన ఎస్ రాయవరం గ్రామానికి చెందిన పీర్ల పంజ, నూర్ మజీద్ సభ్యులు షేక్ సత్తార్, తదితరులు అర్జీ ఇస్తూ గ్రామ సచివాలయ మాజీ వాలంటీర్ షేక్ యాసిన్.. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో పేర్లు మార్చి నిధులు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఇంటి స్థలాలు, పింఛన్లు.. గోకులం షెడ్స్, ఆగిపోయిన ఇంక్రిమెంట్లు, ఫీజు రియింబర్స్‌మెంట్, వర్క్ బిల్లులు, భూముల రీ సర్వేలు, అగ్రిగోల్డ్ బాధితులు, ఆర్థిక సాయం, సీఎంఆర్‌ఎఫ్ సాయం కోసం ఇలా పలువురు తమ సమస్యలపై టీడీపీ నేతలను కలిసి వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు.