- విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషిచేయాలి
- ఉద్యోగాల సాధనకు విద్యతో పరిశ్రమల అనుసంధానం
- కేజీ నుంచి పీజీ వరకు స్త్రీలను గౌరవించేలా ప్రత్యేక కార్యాచరణ
- నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగావకాశాలు
- జనవరి నెలలో జాబ్ కేలండర్ విడుదల
- మా నాన్నకి దక్కే గౌరవం నాకూ దక్కాలని అహర్నిశలు కష్టపడుతున్నా
- ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్
- విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి
రాజమహేంద్రవరం (చైతన్యరథం): విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి ఉద్బోధించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదిక వద్ద ‘హలో లోకేష్’ పేరుతో మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ ఎన్.శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.
డిగ్రీ చదివేప్పుడే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకునేలా గవర్నమెంట్ కాలేజీల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని హరివర్మ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా యువత ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బందులు పడుతోందన్నారు. 173 ఏళ్ల చరిత్ర ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు రావడం లేదు. ఇందుకు అకడమియాతో ఇండస్ట్రీని అనుసంధానించాల్సిన అవసరం ఉంది. విద్యతో పరిశ్రమలను అనుసంధానించాలి. అందుకే ప్రభుత్వం క్లస్టర్ బేస్డ్ విధానంలో ముందుకు వెళుతోంది. ఆయా జిల్లాల్లో సుమారు 22 క్లస్టర్స్‌ను గుర్తించాం. అనంతలో ఆటోమోటివ్, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ, ఉత్తరాంధ్రలో ఐటీ, మెడికల్ డివైసెస్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.
స్త్రీలను గౌరవించేందుకు ప్రత్యేక కార్యాచరణ
స్త్రీలను గౌరవించాలని పదేపదే చెబుతున్నారు. కానీ సోషల్ మీడియా, మూవీస్‌లో అలాంటి పరిస్థితి లేదు. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా అని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీదేవి అనే విద్యార్థి అడిగి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. మా తల్లిని అవమానిస్తే ఎంత ఇబ్బందిపడ్డారో తాను కళ్లారా చూశానన్నారు. ఆ రోజు నుంచే స్త్రీల గౌరవాన్ని పెంపొందించే కార్యాచరణ అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు స్త్రీలను గౌరవించాలనే లక్ష్యంగా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా లాంటి పదాలను విడనాడాలి. విద్యార్థులకు నైతిక విలువలు చాలా అవసరం. విజయానికి దగ్గరి దారులు లేవు. నైతిక విలువలు పెంపొందించుకోవాలి. అందుకే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమించుకున్నాం. నైతిక విలువలపై ఆయన రూపొందించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశాం. మరోవైపు కరిక్యులమ్‌ను ప్రళన చేస్తున్నాం. ప్రతి శనివారం నైతిక విలువలపై క్లాస్ ఏర్పాటుచేస్తాం. మహిళలను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని భావిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు
డిగ్రీ చదివేప్పుడే పార్ట్ టైం జాబ్ చేసే విధంగా ఏమైనా అవకాశాలు కల్పిస్తారా, విదేశాల్లో ఉద్యోగాల కోసం మెంటరింగ్, కెరీర్ కౌన్సిలింగ్ అవసరం ఉందని విద్యార్థిని సాత్విక అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం నైపుణ్యం పోర్టల్‌ను రూపొందిస్తోందన్నారు. ఇంటర్వూకు ఎలా హాజరు కావాలి, ఏవిధంగా సిద్ధం కావాలి, ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఈ పోర్టల్ ద్వారా తెలియజేస్తాం. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.
మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది
మీది పెద్దలు కుదిర్చిన వివాహం.. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది అని కీర్తన అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. తనకు చిన్న వయసులోనే పెళ్లి అయిందన్నారు. అరేంజ్‌డ్ మ్యారేజీలో అండర్ స్టాండిరగ్ ముఖ్యం. మన పర్సనల్ లైఫ్‌లో, కేరీర్ లో ఏదైనా సాధించాలంటే అండర్ స్టాండిరగ్ తో ముందుకు వెళ్లాలి. బ్రాహ్మణితో ఆ బాండ్ అండర్ స్టాండిరగ్ వల్ల వచ్చింది. ఇద్దరం కలిసి అన్ని పనులు సమానంగా చేస్తాం. తల్లిదండ్రులు, అవ్వాతాతల నుంచి మనం నేర్చుకోవాలి. ప్రపంచంలో అతి తక్కువ డైవోర్స్ రేట్ ఉన్న దేశం మనది. మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. మీరు బాగా చదువుకుని కంపెనీలు స్టార్ట్ చేయాలి. పదిమందికి ఉద్యోగాలు కల్పించాలి. బ్రాహ్మణి అర్థం చేసుకోవడం, ఆమె సపోర్ట్ వల్లే నేను పాదయాత్ర చేయగలిగా. అండర్ స్టాండిరగ్ అనేది చాలా అవసరమని మంత్రి లోకేష్ అన్నారు.
జనవరిలో జాబ్ కేలండర్ విడుదల
20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ కేలండర్ ఎప్పుడు విడుదల చేస్తారని కిషోర్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. అందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ సాధించాలంటే పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు ఇటీవల శంకుస్థాపన చేశాం. 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వారు చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. రిలయన్స్ డేటా సెంటర్ కూడా రాబోతోంది. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 150 కేసులు వేసినా 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేసి 16వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6వేల మందిని కానిస్టేబుళ్లుగా నియమించాం. జనవరి నెలలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లో రావాలని అంటున్నారు. మీరు నాకు మెంటర్‌గా వ్యవహరిస్తారా అని కిరణ్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. యువత రాజకీయాల్లో రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమాజంలో మనం ఆశించే మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత నేను నీకు మెంటర్ గా ఉంటా. నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.
పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి
కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని, లైబ్రరీ భవనాన్ని విస్తరించాలని శిరీష అనే విద్యార్థి కోరింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. మన రాష్ట్రం నుంచి శ్రీచరణి అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో రాణిస్తున్నారన్నారు. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆమెకు ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందించింది. వైజాగ్‌లో ఇంటిస్థలం కేటాయించింది. గ్రూప్-1 ఉద్యోగం కూడా కల్పిస్తాం. చాలా మందికి క్రీడల్లో రాణించాలని ఆసక్తి ఉంటుంది. శాప్ ద్వారా క్షేత్రస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్‌లో కాలేజీల్లో కూడా క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలి
గతంలో లావుగా ఉండేవారు. మిమ్మల్ని ట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఫిట్‌గా ఉన్నారు. ట్రోలింగ్స్ పై ఎప్పుడైనా బాధపడ్డారా? అయితే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు, మీ డైట్ సీక్రెట్ ఏంటి అని కార్తికేయ అనే విద్యార్థి అడిగి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. లైఫ్ ఈజ్ ఏ జర్నీ.. నాట్ డెస్టినేషన్ అన్నారు. మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సవాళ్లను అధిగమించాలి. నేను సింగిల్ మీల్ మాత్రమే చేస్తా. మీ లాంటి యువతకు త్రీ మీల్స్ అవసరమని మంత్రి లోకేష్ చెప్పారు.
ప్రతి స్టూడెంట్ కు ఫ్రీగా ఏఐ టూల్
ప్రతి స్టూడెంట్ కు ఏఐ టూల్ ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ ఉందా అని విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. వందశాతం ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇది మంచి సలహా. నేను జెమినై ఎక్కువగా వినియోగిస్తా. జెమినైని ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటాం. వన్ ఫ్యామిలీ వన్ ఏఐ యూజ్ కేస్ తయారుచేయాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ
మీ అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు అని హర్షవర్థని అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. మా అమ్మ ఇప్పుడు కూడా రెండు దెబ్బలు కొడతారన్నారు. అమ్మకు చెప్పకూడని పని చేయకూడదని చాగంటి చెప్పారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ. క్రమశిక్షణ ఆమె వద్ద నేర్చుకున్నా. అమ్మ ప్రేమ అన్ కండిషనల్. తల్లిని ప్రతిఒక్కరూ గౌరవించాలని మంత్రి లోకేష్ అన్నారు.
పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి
హయ్యర్ ఎడ్యుకేషన్ పై విజన్ ఏమిటి అని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. మన పాఠాలు ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌గా ఉండాలన్నారు. కరిక్యులమ్ ప్రక్షాళన చేస్తున్నాం. రీసెర్చ్ కూడా చాలా అవసరం. ప్రధాని మోదీ కూడా వచ్చే ఏడాది నుంచి పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించాలని భావిస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌ను కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. లోకల్ ఇండస్ట్రీతో ఎక్కువగా టై అప్ కావాలి. పిల్లలకు గ్రేటర్ ఎక్స్ పోజర్ అందించాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
కాలేజీలో చదివేప్పుడు మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేశారా, మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేశారా, మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని భరత్ అనే విద్యార్థి అడిగి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. తనను ఎవరూ ర్యాగింగ్ చేయలేదన్నారు. మా మధ్య ప్రెండ్ షిప్ ఉండేది. బ్రాహ్మణి నా ఫస్ట్ అండ్ లాస్ట్ క్రష్ అని స్పష్టం చేశారు.
అందుకు అహర్నిశలు కష్టపడుతున్నా
అవినీతి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అవినీతి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విద్యార్థి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి వరకు సేవలందిస్తున్నామన్నారు. సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. సంస్కరణల ద్వారానే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. మంచివారికి ఓటువేయడం ద్వారా మార్పు సాధ్యం. 2004-05 సమయంలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. చంద్రబాబుకి దక్కే గౌరవాన్ని చూసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ఏ గౌరవం అయితే మా నాన్నకి దక్కుతుందో ఆ గౌరవం నాకూ దక్కాలని అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు.
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి స్పందిస్తూ.. దేవుడు అనేక పరీక్షలు పెడతాడు. వాటిని జయించే శక్తి కూడా ఇస్తాడన్నారు. 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓటమి చెందాను. తర్వాత కసితో పనిచేసి విజయం సాధించాను. మాకూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, లక్ష్య సాధనకు కష్టపడాలి. ఆత్మహత్యల నివారణకు ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తాం. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మంత్రి చెప్పారు. అనంతరం అందరితో కలిసి సెల్ఫీ పోటో దిగారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీ (అటానమస్) ప్రిన్సిపల్ డాక్టర్ కె.రామచంద్రరావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై.మేఘా స్వరూప్, తదితరులు పాల్గొన్నారు.













