టీడీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు 45వ వార్డు లేబర్ కాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా కాలనీలో పక్కా ఇళ్ల కోసం 600మంది దరఖాస్తు చేస్తే, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మా డివిజన్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక ఇబ్బందులు పడుతున్నాం.
గతంలో మా డివిజన్ లో 1200 మంది పెన్షన్లు తీసుకోగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 350కి కుదించారు. ఇంటిపన్నులు, విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. చెత్త పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో సమయం కుదిరినప్పుడు వెళ్లి రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకునే వాళ్లం. కానీ ఇప్పుడు రేషన్ వాహనాల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
గతంలో రూ.1200 ఉన్న ట్రక్కు ఇసుక ప్రస్తుతం రూ.6,500 అయింది. రోడ్డు ప్రక్కన ద్విచక్ర వాహనాలు ఆపితే భారీఎత్తున చలాన్లు వేస్తూ దోచుకుంటున్నారు అని లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పేదలకు సెంటుపట్టాల పేరుతో రూ.7వేల కోట్ల దోచుకున్నారు.
ఆవాసయోగ్యం కాని కొండలు, గుట్టల్లో ఇచ్చిన స్థలాలు కూడా వైసిపి కార్యకర్తలకు పంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. రేషన్ వాహనాల దోచుకునేందుకే ఇంటివద్దకే రేషన్ ప్రవేశపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇసుకలో రూ.10వేల కోట్లు దోచుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇసుక విధానాన్ని సరళీకరించి ప్రజందరికీ ఇసుక అందుబాటులోకి తెస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.