- తప్పుడు పనిచేసి చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలా?
- మాధవ్ చర్య యావత్ తెలుగుజాతికే అవమానకరం
- కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ ఎస్.సవిత
అమరావతి: హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునే పనిచేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ పై విమర్శలు చేయడం దురదృష్టకరమని కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ సవిత పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆత్మరక్షణలో ఉన్న గోరంట్ల మాధవ్ రాజకీయ లబ్ది కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదని అన్నారు. ఎంపిమాధవ్ సభ్యసమాజం తలదించుకునే పనిచేసి… చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి, విషయాన్ని దారిమళ్లించడానికి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగతమైన వ్యవహారాన్ని కులాల మధ్య విభేదాలు చిత్రీకరించడం సమా జానికి శ్రేయస్కరం కాదని అన్నారు.
కురుబ కులం నీతికి, నిజాయితీకి, ధైర్యానికి మారుపేరు. అటువంటి కులంలో పుట్టిన మాధవ్ సభ్య సమాజం తలదించుకునేలా న్యూడ్ గా మహిళతో అసభ్యకరంగా మాట్లాడడం యావత్ తెలుగుజాతికే అవమానకరం. గతంలో కురుబ కులస్తుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కీలకపదవుల్లో పనిచేశారు. చాలామంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, గవర్నర్లుగా కూడా పనిచేసి ఆ పదవులకే వన్నెతెచ్చారు. దివంగత నందమూరి తారక రామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మా తండ్రి కురుబ యస్ రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తర్వాత పలు కీలక శాఖలకు మంత్రిని చేశారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ కులానికి దక్కని గౌరవం అప్పట్లో తెలుగుదేశం ద్వారా కురుబ కులానికి దక్కింది. ఎంతో మంది కురుబ కులస్తులు ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు గా పనిచేశారు. వారెవరు ఇతర కులాలను దూషించిన దాఖలాలు లేవు . కులానికి మచ్చతెచ్చిన దాఖలాలు కూడా లేవు. మాధవ్ వ్యవహారంలో వైసిపి చేస్తున్న డైవర్షన్ రాజకీయాల్లో కురుబ సోదరులు చిక్కుకోవద్దు. హిందూపురం ప్రజలు ఎంపీగా ఎన్నుకుంటే మాధవ్ చేసిన పని ఏమిటి? నువ్వు ఏమైనా రాష్ట్రం కోసం , ప్రత్యేక హోదా కోసం పోరాడావా? హిందూపురం నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఏనాడైనా పార్లమెంటులో పోరాడావా? కురుబల సంక్షేమం కోసం ఎప్పుడైనా కృషిచేశావా? వికృత చేష్టలు బయటపడ్డాక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్. నీపై వచ్చిన ఆరోపణలకు విచారణ జరిపించుకొని తప్పని నిరూపించుకో. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం కోసం కులాన్ని వాడుకోవడం సబబుకాదని సవిత హితవు పలికారు.