- అలుపెరుగని యాత్రలు, సభలతో ప్రజలను ఆశ్చర్యపరచిన తెదేపా అధినేత
- గత 46 రోజుల్లో 89 ప్రజాగళం భారీ సభలు
- గత నాలుగు నెలల్లో 114 నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు
- రా కదలి రా, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడులతో చైతన్యయాత్రలు
- కూటమి నేతల ఉమ్మడి సభలతో ప్రజల్లో జోష్ పెంచిన చంద్రబాబు
- శుక్రవారం నాడు 5 ప్రజాగళం సభలు
- నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
వయసుతో నిమిత్తం లేకుండా, అనువుకాని వాతావరణాన్ని పట్టించుకోకుండా గత మూడేళ్లకు పైగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం, ప్రజల మధ్యే గడిపి తానే ప్రజాగళమై రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు. 2020లో ప్రబలిన కరోనా 2021లో తగ్గు ముఖం పట్టినప్పటినుంచి చంద్రబాబు ఇంట్లో కంటే వీధుల్లోనే ఎక్కువ కాలం గడిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం విధ్వంసమౌతున్న తీరు, ప్రజల ఇక్కట్లను గమనించి చలించిపోయిన చంద్రబాబు నిత్యం ప్రజల్లోనే ఉండి వారికి బాసటగా నిలవాలని తీర్మానించుకొని, ప్రజలను చైతన్యం చేస్తూ, వారిలో ధైర్యాన్ని నింపుతూ గడిపారు.
ప్రజాగళం
ఎన్నికల ప్రకటన మార్చి 16న వెలువడగా అదే నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గత 46 రోజుల్లో 89 శాసనసభ నియోజకవర్గాల్లో జరిగిన భారీ సభల్లో ప్రసంగించారు. రోజుకి కనీసంగా రెండు సభలతో ప్రారంభించి శుక్రవారంనాడు 5 సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఈ సభలన్నింటికి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది. 2014-19 కాలంలో నాటి రాష్ట్ర పరిస్థితి, గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో నేటి రాష్ట్ర పరిస్థితిని సవివరంగా వివరించి.. రాష్ట్ర విధ్వంసానికి కారణాలు, పునర్నిర్మాణ మార్గాలు, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వివేకంతో తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. సభికులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టుతూ, పదునైన వ్యాఖ్యలు, ఛలోక్తులతో ప్రజలను ఆకట్టుకున్నారు.
ప్రజాగళం సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో ఉమ్మడి సభలు, రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల్లో కూటమి గెలుపు ఆవశ్యకతను వివరించి ఆ దిశగా ప్రజలను ప్రభావితం చేయగలిగారు. ప్రజాగళం సభలు విజయవంతమైన తీరు రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమనే భావనను ప్రజల్లో కల్పించింది.
రా.. కదలి రా… అని ప్రజలకు పిలుపు
ఈ సంవత్సరం జనవరి 5 నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్ షోలు, భారీ సభల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధ్వంసక కబంధ హస్తాల నుంచి రాష్ట్ర విముక్తి కొరకు ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కారణాలను వివరిస్తూ ప్రజలు తమ భవిష్యత్తును తమ చేతుల్లోకే తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఈ ఏడాది మొదటి 5 నెలల్లో రా.. కదలి రా.., ప్రజాగళం సభలు కలిపి నాలుగు నెలల్లో చంద్రబాబు 114 నియోజకవర్గాల్లో పర్యటించారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై ప్రజల్లోకి…
రాష్ట్ర సమగ్ర వికాసానికి బలమైన వ్యవసాయ రంగం ఆవశ్యకతను తొలినాళ్ల నుంచి గుర్తించిన చంద్రబాబు గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసమైన తీరుపై తీవ్ర కలత చెందారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించటానికి 2023 ఆగస్టులో ఏకధాటిగా పది రోజులపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తన హయాంలో సాగునీటి ప్రాజెక్టుల అమలు తీరు, జగన్ రెడ్డి పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ప్రజెంటేషన్ల ద్వారా ప్రజలకు వివరించి సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు తెలియజెప్పారు. పలు ప్రాజెక్టుల నిర్మాణ దశలను స్వయంగా పరిశీలించారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో చంద్రబాబు కలిగించిన చైతన్యం, ప్రజా స్పందనలను చూసి కలవరపడిన జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును గత సెప్టెంబర్ 9న ఆయనను అరెస్టు చేసి 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పతనం ప్రారంభమైందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోవటానికి 14 గంటలు పట్టిన వైనం, దారి పొడవునా ప్రజల స్పందన రాష్ట్ర రాజకీయాల్లో సునామీని సృష్టించింది. విడుదల అయిన వెంటనే చంద్రబాబు మళ్లీ రోడ్డు బాటన నిరంతరం ప్రజలతో మమేకమ్యారు.
ఇదేమి ఖర్మ రాష్ట్రానికి
ఈ నినాదంతో 2023లో 29 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు చేసి జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యంతోపాటు పలు రంగాలు, వ్యవస్థలు పతనమైన తీరును వివరించి.. బాధల్లో ఉన్న ప్రజలతో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెల్లడిరచారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అన్న పేరు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు ఈ పేరు అద్దంపట్టిందని ప్రజలు, పరిశీలకులు భావించారు. ఈ పేరు, పర్యటనల విజయం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఆందోళనకు గురిచేసింది.
బాదుడే బాదుడు
జగన్ రెడ్డి పాలనలో అడ్డూ, అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు, పన్నులతో సగటు మనిషి జీవితం భారమైపోవటాన్ని చూసి కలత చెందిన చంద్రబాబు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ‘బాదుడే బాదుడు’ పేరుతో 2022లో 19 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారితో గడిపారు.
అడుగడుగునా అడ్డంకులు.. అధిగమించిన చంద్రబాబు
చంద్రబాబు పర్యటనలను అడ్డుకొని ఆయనను ప్రజల మధ్యకు పోకుండా చేయటానికి జగన్ రెడ్డి ప్రభుత్వం పలు విధాల ప్రయత్నించింది. పలుచోట్ల అనుమతుల నిరాకరణ, కుట్ర పూరిత నిబంధనల విధింపు, పోలీసుల సహాయ నిరాకరణ, ప్రజల భారీ స్పందన నేపథ్యంలో తగు భద్రతా ఏర్పాట్లు, నియంత్రణలో లోపం, సభలను విఫలం చేయడానికి ఆయా ప్రాంత తెదేపా నాయకుల ముందస్తు అరెస్టులు వంటి పలు కుట్రలను చంద్రబాబు అధిగమించి గత మూడేళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నారు.
ఇంత సుదీర్ఘ కాలంపాటు వేలాది కిలోమీటర్లు పయనించి, వందలాది సభల్లో పాల్గొని నిత్యం ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి మరొకరు లేరని రాజకీయ పరిశీలకులు, ప్రజల అభిప్రాయం.
పలు నూతన పథకాలను ప్రవేశపెట్టిన చంద్రబాబు – జగన్ రెడ్డి పేరుతో ఒక్కటీ లేని దుస్థితి
- అన్న క్యాంటీిన్లు, ఆదరణ, 50 ఏళ్లకే పెన్షన్లు పెట్టింది చంద్రబాబే
- డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి ఉద్యమంగా తీర్చిదిద్దింది ఆయనే
- రాష్ట్ర నిధులతో మొదటిసారిగా రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేసింది చంద్రబాబే
- నైపుణ్యాభివృద్ధి, వీధివీధిన సిమెంటు రోడ్లు, ఎల్‌ఈడీ బల్బులకు ఆద్యుడు ఆయనే
- పేదల కోసం పెళ్లి కానుకలు, పండుగ కానుకలను ఎవరు ప్రవేశపెట్టారు?
- ఇలాంటివి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్కటీ చెప్పుకోలేడు
- గత ఐదేళ్లలోనే కాదు.. మరో ఐదేళ్లు కూడా కొత్త పథకమేమీ పెట్టలేనన్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. సంక్షేమం, అభివృద్ధిలకు సంబంధించి ఐదేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టకుండా నిష్క్రమిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు.
నవరత్నాలన్నీ కాపీ, పేస్టులుగా చరిత్రలో నిలిచిపోతాయి. గత ఐదేళ్లుగా పేదల సంక్షేమమంటే కేవలం తాను ప్రవేశపెట్టిన నవరత్నాలే అన్నట్లుగా జగన్ రెడ్డి మాట్లాడారు. నకిలీ రత్నాలుగా మారిన ఈ నవరత్నాల్లో ఒక్కటి కూడా కొత్తగా ఆలోచించి ప్రవేశపెట్టిన పథకంలేదు. ఇవన్నీ గతం నుంచి అమలౌతూ వస్తున్న సంక్షేమ పథకాలే. మరి.. వీటిపట్ల తనకే పేటెంట్ హక్కులు ఉన్నట్లు.. వాటిని తానే కనుగొని ప్రవేశపెట్టి అమలు చేసినట్లు జగన్ రెడ్డి చెప్పుకోవటం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది.నవరత్నాల 9 పథకాల పేర్లు చెబితే ప్రజల మనసుల్లో స్ఫురించేది జగన్ రెడ్డి పేరు కాదు.. ప్రతి పథకం కింద లబ్దిదారులు మోసపోయిన తీరు గుర్తుకొస్తుంది.
1. సామాజిక పింఛన్లు
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావుతో ప్రారంభమై కొనసాగుతూ వస్తున్న పథకమిది. జగన్ రెడ్డి పేరు చెబితే ఈ పథకం ఎలా గుర్తుకొస్తుంది? ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చేదల్లా.. పలు షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోతలు. అధికారంలోకి వచ్చాక అప్పటివరకు లభిస్తున్న రూ.2 వేల పింఛన్‌ను రూ. 3 వేలకు పెంచుతానని హామీ ఇచ్చి, అది నెరవేర్చటానికి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం తీసుకున్నారు. దీంతోపాటు.. ఈ మూడు వేల కంటే ఎక్కువ ఇవ్వలేను, ఒకవేళ అధికారంలోకి వస్తే నామమాత్రంగా రూ. 250 పెంచుతాను.. అదికూడ నాలుగేళ్ల తరువాత 2028లో అని పేదల పట్ల తన మోసపు వైఖరిని తన మేనిఫెస్టోలో స్వయంగా వెల్లడిరచుకున్నారు.
2. అమ్మఒడి
గత ప్రభుత్వాలు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్ షిప్(ఉపకార వేతనాలు)ల స్థానంలో పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇచ్చే పథకమిది. దీని అమలులో కూడా జగన్ రెడ్డి తరహా మోసమే. గత ఎన్నికల ప్రచారంలో సంఖ్యా పరిమితి లేకుండా చదువుకునే పిల్లలందరికి సాయం అందిస్తానన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి ఇంటికి ఒకే విద్యార్థికి ఇచ్చారు. స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణ పేరుతో ప్రతి మహిళకు చెందాల్సిన లబ్ధి నుండి రూ.2,000 కోత విధించారు. జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తుకొచ్చేది అమ్మఒడిలో జరిగిన మోసమే కానీ, ఇది ఆయన పథకం అని మాత్రం కాదు.
3. చేయూత/ఆసరా
జగన్ రెడ్డి మోసపు పునాదుల మీద అమలులోకి వచ్చిన పథకం చేయూత. ఎన్నికల ప్రచారంలో 18 నుండి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకు నెలవారి పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యథారీతిన మడమ తిప్పేశారు. వాస్తవంగా.. ఇదికూడా పింఛన్ పథకమే. అయితే తన నయవంచనను కప్పిపుచ్చుకోవటానికి పేరు మార్చి చేయూత అన్నారు. నాలుగో విడత నిధులు విడుదల చేయకుండా మహిళలను జగన్ రెడ్డి తనదైన శైలిలో మరోసారి మోసగించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అర్హురాలైన ప్రతి మహిళకు ఈ ఐదేళ్లలో రూ.1,80,000 రావలసి ఉండగా.. ముఖ్యమంత్రి సంవత్సరానికి రూ. 18,750 చొప్పున మొత్తం నాలుగేళ్లల్లో రూ. 75 వేలు మాత్రమే ఇస్తానని చెప్పి ప్రతి మహిళను రూ.1,05,000 మేరకు మోసం చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేసింది. ఆసరా పేరుతో జగన్ రెడ్డి దీన్ని కొనసాగించాడు. ఇందులో కొత్తేముంది? సున్నావడ్డీ రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతానన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు. పైగా రూ.5 లక్షల వరకు ఉన్న సున్నావడ్డీ రుణ పరిమితిని రూ.3 లక్షలకు కుదించాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తుకొచ్చేది చేయూత/ఆసరాలో జరిగిన మోసమేకానీ ఈ పథకాలు కాదు అని స్పష్టమౌతోంది.
4. మద్యపాన నిషేధం
రాష్ట్రంలో మద్యపానాన్ని మొదటగా నిషేదించింది స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆలోచించి ప్రవేశపెట్టిన కొత్త పథకం కాదు. పైగా ఇచ్చిన హామీకి భిన్నంగా తానే పెద్ద మద్యం వ్యాపారిగా మారి తన సొంతగణంతో భారీ ఎత్తున అక్రమ మద్యం విక్రయానికి తెరతీసి, క్యాష్ పేమెంట్‌ల ద్వారా లక్ష కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారు ముఖ్యమంత్రి. ఈ పథకం కొత్తది కాదు.. దాని అమలు పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అంతా మోసమే.
5. రైతు భరోసా
రైతన్నలకు సాయం అందించడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.15,000 ఇచ్చింది. ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.13,500 సాయం అందిస్తామని చెప్పిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ప్రతి రైతుకు ఇస్తున్న రూ.6,000 సాయాన్ని తానిచ్చినట్లుగా చెప్పుకుంటూ, తానివ్వాల్సింది ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. ఈ పథకమూ కొత్తదీ కాదు.. పైగా జగన్ మోసానికి ప్రతీకగా నిలిచింది.
6. విద్యాదీవెన
కాలేజీ విద్యార్థుల వార్షిక బోధనా రుసుమును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించటం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి చాలా సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది. ఆయన కనిపెట్టి ప్రవేశపెట్టిన కొత్త పథకమేమీ కాదు. గత తెదేపా ప్రభుత్వం మొత్తం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తే అది జగన్ హయాంలో పది లక్షలకు పడిపోయింది. సంవత్సరానికి రూ.30 వేల నుండి రూ.70 వేల వరకు ప్రతి విద్యార్థికి ఇవ్వాల్సి ఉండగా.. వాస్తవంలో విద్యార్థులకు అందింది సగటున రూ.30 వేలే.
7. ఆరోగ్యశ్రీ
ఈ పథకం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ముందే గత ప్రభుత్వాలు అమలు చేసాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఇందులో జగన్ రెడ్డి ఘనత ఏమిటి? ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది అధ్వాన్నంగా మారిన ఆరోగ్యశ్రీ అమలు, నెట్‌వర్క్ ఆసుపత్రులకు వందలాది కోట్ల రూపాయల బకాయిలు, జగన్ సర్కారు నిర్వాకంతో సరైన వైద్య సేవలు అందక కష్టాలు పడుతున్న సామాన్య ప్రజలు.
8. జలయజ్ఞం
ఇది కొత్త పథకమా? కాదని ఎవరిని అడిగినా చెబుతారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి ఒక్కటీ పూర్తి చేయలేదు. పాత స్కీము.. పాత మోసమేగా!
9. పేదలకు పక్కా ఇళ్లు
పక్కా ఇళ్ల నిర్మాణాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేశారు. ఇప్పుడేమీ జగన్ రెడ్డి కొత్తగా కనిపెట్టలేదు.. చెప్పిన మేరకు ఇళ్లు కట్టలేదు. ఇళ్ల స్థలాల సేకరణలో వైసీపీ నేతలు భారీ దోపిడికి పాల్పడ్డారు. ప్రభుత్వం నుండి అందిస్తామన్న సాయంపై జగన్ రెడ్డి మాట తప్పటంతో పేద లబ్ధిదారులు అప్పులపాలయ్యారు. నవరత్నాల్లో ఒకటైన ఈ పథకం కొత్తదేమీ కాదు. మిగతా 8 పథకాల్లాగే ఇది కూడ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసానికి గురైన పాత ముచ్చటే.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక కొత్త సంక్షేమ పథకమూ ప్రవేశపెట్టకుండా గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రత్యేక ప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను రద్దు చేసి తాను ఏ మేరకు పేదల వ్యతిరేకో స్పష్టం చేసుకున్నారు.
చంద్రబాబు ప్రవేశపెట్టి అమలు చేసిన పలు కొత్త పథకాలు
జగన్ రెడ్డి తీరుకు భిన్నంగా చంద్రబాబునాయుడు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకాల సుదీర్ఘ జాబితా ఉంది. వీటిలో కొన్ని..
1. అన్న క్యాంటీన్లు
పగలంతా శ్రమ చేసుకొని జీవించే కార్మికుల ఆకలి బాధలు తీర్చటానికి కేవలం రూ.5కే అన్నం పెట్టే ‘అన్న క్యాంటీన్’ లను చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజామోదం పొందగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీన్ని రద్దు చేశారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెడతామని కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
2. పింఛన్ రాశి భారీగా పెంపు
2004-2014 మధ్య పదేళ్లపాటు నెలవారీ సామాజిక పింఛన్ నెలకు కేవలం రూ.200 మాత్రమే ఉండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని పది రెట్లు పెంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.2 వేలు చేశారు. ఈ రాశిని రూ.3 వేలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. తాను మరలా ముఖ్యమంత్రి అయితే నామమాత్రంగా నాలుగేళ్ల తరువాత 2028లో కేవలం రూ. 250 పెంచుతానని తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలవారీ పింఛన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచి రూ. 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు.
3. 50 ఏళ్ల వయసుకే పింఛన్లు
వృత్తి రీత్యా పలు సమస్యలతో తక్కువ సగటు ఆయు ప్రమాణం కలిగి ఉండే చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, గిరిజనులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 50 ఏళ్లకే పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
దీని కొనసాగింపుగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇస్తూ.. ప్రస్తుతం రూ. 3 వేలుగా ఉన్న పింఛన్ ను రూ. 4 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్ ను రూ.3 వేల నుండి 6 వేలకు పెంచి, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి నెలకు రూ. 10 వేలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
4. ఆదరణ పథకం
చేతి వృత్తులపై ఆధారపడి జీవించే పలు కులాలవారి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచి వారికి అదనపు ఆదాయం వచ్చేలా చేయడానికి తగిన పరికరాలు అందించడానికి టీడీపీ హయాంలో చంద్రబాబు ‘ఆదరణ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం విశేష ఆదరణ పొందింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రద్దు చేసిన ఈ పథకాన్ని రూ.5,000 కోట్ల కేటాయింపుతో పునరుద్ధరిస్తామని 2024 కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
5. బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలౌతున్న సబ్ ప్లాన్‌ను చంద్రబాబు బీసీలకు కూడా మొదటిసారి వర్తింపజేశారు.
6. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24 శాతం రిజర్వేషన్ కల్పించగా చంద్రబాబు తన హయాంలో దానిని 34 శాతానికి పెంచి 16,800 మంది బీసీ నాయకులకు రాజ్యాంగబద్ధమైన రాజకీయ ప్రాతినిథ్యాధికారాన్ని కల్పించారు.
7. రైతుల, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తొలిసారిగా రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీని చేసింది చంద్రబాబే.
8. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య/ఎన్టీఆర్ విదేశీ విద్య
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి నేటి పోటీ ప్రపంచంలో సముచిత ఉద్యోగాలు పొందే దిశగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రయోజనం కోసం డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టి అమలు చేశారు. దీనికి మంచి ఆదరణ లభించి ఆయా వర్గాలవారికి విశేష ప్రయోజనాన్ని కలగజేసింది. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య ప్రయోజనాలను బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు కూడా అందజేశారు.
9. బెస్ట్ అవెలబుల్ స్కూళ్లు/స్టడీ సర్కిళ్లు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువు ప్రమాణాలను పెంచటంతోపాటు నేటి పోటీ ప్రపంచంలో నిలబడి వారు తగు అవకాశాలు పొందేలా చేసేందుకు ఈ పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టారు.
10. రాష్ట్రంలో మొదటిసారిగా నిరుద్యోగ భృతి
విద్యా వ్యాప్తికి అనుగుణంగా తగు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించటంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించే వరకు అండగా ఉండేందుకు గత చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేసింది.
11. పెళ్లి కానుకలు
పేద వర్గాలకు చెందినవారు కల్యాణ ఘడియలను సంబరంగా చేసుకునేందుకు వీలుగా చంద్రబాబు పెళ్లి కానుకల పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు.
12. పండుగ కానుకలు
పర్వదినాలను పేదలు సంతోష వాతావరణంలో గడిపేందుకు వీలుగా పండుగ కానుకలను కూడా ప్రవేశపెట్టారు.
13. షాదీఖానాల నిర్మాణం, ఖబరస్తాన్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందజేసే విధానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు.
14. ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలు అందించడం కూడా చంద్రబాబే ప్రవేశపెట్టారు.
15. చంద్రన్న బీమా
సహజ మరణాలు, ప్రమాదాల వలన ప్రధాన పోషకుణ్ణి కోల్పోయిన కుటుంబాలవారికి ఆర్థిక సాయం చేసేందుకు చంద్రబాబు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఆ కుటుంబాలకు అండగా నిలిచారు.
16. డ్వాక్రాలతో మహిళా సాధికారత
రాష్ట్రంలో మొదటిసారిగా డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు కృషిచేసి, పలు సహాయక చర్యలతో డ్వాక్రా ఉద్యమ వ్యాప్తికి కారకులయ్యారు చంద్రబాబు.
17. సిమెంటు రోడ్లు, ఎల్‌ఈడీ బల్బులు
రాష్ట్రంలో వీధి వీధిన 25 వేల కిలోమీటర్లకు పైగా సిమెంటు రోడ్ల నిర్మాణం చేయడంతోపాటు, ప్రతి వీధిన, ప్రతి ఇంట్లో ఎల్‌ఈడీ బల్బుల వెలుగులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు.
18. ఫైబర్ నెట్
కారు చౌకగా టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు ఇంటింటికి అందుబాటులోకి తెచ్చారు చంద్రబాబు.
19. నైపుణ్యాభివృద్ధి
నవసమాజ నిర్మాణానికి కీలకమైన యువశక్తి సామర్థ్యాన్ని పూర్తిగా అందిపుచ్చుకునేందుకు, వారికి తగు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారి నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశారు.
20. డ్రిప్ ఇరిగేషన్
సాగునీటి కొరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా భారీ సబ్సిడీతో డ్రిప్/స్ప్రింక్లర్ ల వాడకాన్ని విస్తృతం చేసిన ఘనత చంద్రబాబుది.
గత ఐదేళ్లుగా అంతకు ముందు అమలులో ఉన్న పథకాలనే పేర్లు మార్చి అమలు చేయటమేకాక, అధికారంలోకి వస్తే మరో ఐదేళ్లపాటు అవే కొనసాగుతాయని స్పస్టం చేసి, మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు తాను కొత్తగా ఆలోచించలేనని, కొత్త పథకాలేమీ తేలేనని చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. చంద్రబాబు పేరు చెబితే ఏమి పథకాలు గుర్తుకొస్తాయోనని ప్రశ్నించి ప్రజల్లో నవ్వులపాలయ్యారు.