విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం పేరుకే పరిమితమైందని, పేద విద్యార్థులకు అందని ద్రాక్షాల తయారైందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సింహాద్రి కనకాచారి, రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఏప్రిల్ నాటికి ముగుస్తుందని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న విద్యార్థులు మే నెలలో తదితర విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటారన్నారు. విదేశీ యూనివర్సిటీలలో జూలై నుండి అక్టోబర్ మధ్యలో తరగతులు ప్రారంభమవుతాయని, ఇది ఏమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకే సెప్టెంబర్ 30వ తేదీని గడువు తేదీ ప్రకటించిందని, దీనివలన విద్యార్థులకు ఎలాంటి లాభం చేకూరదన్నారు. ఇప్పటికే 90శాతం మంది విద్యార్థులు చదువుకోవడానికి విదేశా లకు వెళ్లిపోయారన్నారు. విద్యార్థులు ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించిన తరువాత, ప్రత్యేక్షంగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటించటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిపోయిన విద్యార్థులు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే విద్యార్ధులకు పెనుబారమని ప్రశ్నిం చారు.