- తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు
- మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి
- రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే బాధ్యత తీసుకుందాం
- వనమహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి(చైతన్యరథం): పర్యావరణాన్ని ప్రేమించే తనకు దానిని పరిరక్షించే బాధ్యత కూడా దక్కటం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అరణ్య కాండమ్ చదివితే మొక్కలు, చెట్ల విశిష్టత తెలుస్తుంది. చెట్లు నుంచి మనం ప్రతి రోజూ ఎంత ప్రయోజనం పొందుతున్నామో అర్థం అవుతుంది. వృక్షాలకు మనం ఎంత రుణపడ్డామో తెలుస్తుంది. చెట్టును పదిమంది సంతానంతో సమానంగా చూస్తారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తారు. ఓ చెట్టు చేసే మేలు అంతాఇంతా కాదు. పచ్చదనంతో రాష్ట్రం సుందరంగా, శుభకరంగా ఉంటే అది ప్రజలందరికీ మంచిది’ అని పవన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి ఎకో పార్కులో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దేశీయ జాతులైన వేప, గానుగ, రావి చెట్లను కలయికగా చేసి నాటారు. మొక్కలను పెంచి, వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకుంటామని ప్రతినబూనారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….పర్యావరణాన్ని ప్రేమించి, దాన్ని పరిరక్షించడం తన మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఓ మొక్కను నాటి, దాని పరిరక్షణ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ప్రతి ఏటా నేను సొంతంగా మొక్కలు నాటి, వాటి పరిరక్షణ చూసేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం తరఫున రాష్ట్రం మొత్తం మీద కోటి మొక్కలు నాటే మహా క్రతువును ప్రారంభించడం సంతోషంగా ఉంది. వన మహోత్సవ సమయంలో వరుణుడు కూడా కరుణ చూపడం మరింత ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు.
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటేలా చూడాలి. తక్కువ స్థలంలో, అడవులు పెంచే పద్ధతిని అవలంబించాలి. జపాన్ కు కెందిన మియావకీ విధానంలో తక్కువ విస్తీర్ణంలో, తక్కువ ఖర్చుతో అడవుల్ని పెంచవచ్చు. ఈ పద్ధతి వల్ల అడవులు వేగంగా పెరుగుతాయి. పచ్చదనం విస్తరిస్తుంది. రాబోయే ఐదేళ్లలో అడవులను తలపించే వనాలు సిద్ధం అవుతాయి. వీటిపై ప్రతి ఒక్కరం దృష్టిపెడదాం. దీనిపై ఓ విధానాన్ని, సూచనలను ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
చెట్లను పెంచడం బాధ్యతగా తీసుకుందాం
ఒక చెట్టును కూల్చడం తేలిక. కాని అది పెరడగానికి ఏళ్లు పడుతుంది. మూడు కాళ్ల ముదుసలి అని చిన్పప్పుడు పాఠం ఉండేది. ఓ ముదుసలి వ్యక్తి తినేసిన మామిడి టెంకను ఓ దారిలో నాటుతుంటే అటువైపుగా వెళ్తున్న మహారాజు ఆ ముదుసలిని చూసి నవ్వుతాడు. ఈ వయసులో కూడా మామిడి ఫలాలు అనుభవించడానికి చెట్లను నాటుతున్నాడని అవహేళన చేస్తాడు. కాని ముదుసలి తాత నవ్వుతూ నేను మొక్కను నాటుతోంది ఫలాల కోసం కాదు… భావితరాల కోసం అని చెబుతాడు. ఆ మాట సత్యం. ప్రతి ఒక్కరూ భావితరాల కోసం మొక్కలు నాటాలి. ముఖ్యమంత్రి ద్వారా వన మహోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని భావించాము. అయితే ముఖ్యమంత్రి మాత్రం పాఠశాల విద్యార్థుల ద్వారా చేయిద్దామన్నారు భావి తరాలకు పచ్చదనం ప్రాముఖ్యం తెలుస్తుందనే ఆలోచనతో అలా చేశారు. దీని వెనుక భావి తరాలు ఉన్నతంగా ఉండాలనే ఆలోచన ఉంది.
మనం ఎంత జాగ్రత్తగా గత తరాల నుంచి ప్రకృతిని పొందామో.. అంతే జాగ్రత్తగా భావి తరాలకు అందించాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు నరికేసింది. చెట్టు నరకడం తేలికే. అయితే ఒక చెట్టు పెరగడం ఎంతో కష్టం. ఆ చెట్టు ఇచ్చే ఫలితాలు ఎంతో విలువైనవి. మన రాష్ట్రంలో 29 శాతం పచ్చదనం ఉంది. దీన్ని 50 శాతానికి పెంచాలి. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. నవంబరు నెల కార్తీక వనసమారాధనల వరకు ఈ వన మహోత్సవం సాగుతుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచి, అవి పెద్దవి అయ్యేలా సంరక్షణ కూడా తీసుకోవాలి. సమష్టిగా మొక్కలను పెంచడం మేలు. మొక్కలను నాటిన వెంటనే పెద్దవి కావు కానీ… వాటి ఫలాలు వచ్చే తరానికి అందుతాయి. కూటమి ప్రభుత్వంలో మొక్కల పెంపకం మీద ఎక్కువగా దృష్టి పెడతామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.