- టీడీపీ నేత కిమిడి నాగార్జున ధ్వజం
- వైసీపీ హయాంలో విద్యా రంగం సర్వనాశనం
- టీచర్ల బదిలీల్లో భారీగా అవినీతి
- విద్యా కిట్లలోనూ దోచుకున్నారు
- నారా లోకేష్ హయాంలో గాడిన పడుతున్న విద్యాశాఖ
అమరావతి (చైతన్యరథం): విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ రంగాన్ని సర్వనాశనం చేసిన బొత్స సత్యనారాయణ గతం మరిచి శాసనమండలిలో నీతులు వల్లిస్తున్నారని టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ శాసనమండలిలో బొత్స మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. సొంత విజయనగరం జిల్లాకు, తన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి నియోజకవర్గానికి చేసింది శూన్యం. వైసీపీ హయాంలో విద్యారంగం కుదేలైంది. 2019లో ప్రభుత్వ పాఠశాలల్లో 39 లక్షల మంది విద్యార్థులుంటే 2024లో ఆ సంఖ్య 34 లక్షలకు తగ్గిపోయింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించారు. ఇది వాస్తవమా.. కాదా.. బొత్స సమాధానం చెప్పాలి.
వైసీపీ హయంలో 5 లక్షల మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేట్ బడులకు పంపించిన విషయం వాస్తవం కాదా తెలపాలి. వైసీపీ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. 11 వందల మంది ఉపాధ్యాయులను అక్రమంగా బదిలీ చేశారు. ఒక్కో బదిలీలో 3 లక్షలు మొదలుకొని 8 లక్షల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని పత్రికలు, ఉపాధ్యాయ సంఘాలు కోడై కూశాయి. టీచర్ల బదిలీల కోసం లంచాలు తీసుకున్నారన్నది నిజమా.. కాదా బొత్స సమాధానం చెప్పాలి.
అదే విధంగా వైసీపీ హయాంలో విద్యార్థులకు నాసిరకం కిట్లు ఇచ్చారు. వాటిలో నాణ్యత లోపించింది. స్కూల్ యూనిఫామ్, బ్యాగులు వెనువెంటనే చిరిగిపోతున్నాయని అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఏడున్నర లక్షల విద్యా కిట్లు అదనంగా కొన్నారు. అవి ఏమయ్యాయో లెక్కలు చెప్పాలి. వాటి కోసం వెచ్చించిన రూ.160 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తెలియడంలేదు. అవసరం లేకున్నా విద్యా కానుక కిట్లు కొని ప్రజాధనాన్ని వృథా చేశారు. విద్యా కానుక కిట్ల అవినీతిలో రూ.160 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో బొత్స సమాధానం చెప్పాలి. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారు. చీపురుపల్లిలోని బాలుర హైస్కూలులో ఒక్క మరుగుదొడ్డిని కూడా కట్టించలేకపోయారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయారు.
వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు.
విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించింది. వైసీపీ తెచ్చిన జి.ఓ 117 వల్ల అనేక పాఠశాలలు మూతపడ్డాయి. ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. గత ప్రభుత్వపు తలా, తోకా లేని ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి బొత్స ఇప్పుడు శాసనమండలిలో ప్రగల్బాలు పలుకుతున్నారు. నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నిజమైన తోడుగా నిలుస్తున్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థను సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నారు.
రాష్ట్రంలో విద్యారంగం నారా లోకేష్ బాధ్యతలు తీసుకోక ముందు ఒకలాగ, తీసుకున్నాక ఒకలాగ ఉంది. అప్పుడు భ్రష్టుపట్టిన విద్యారంగాన్ని లోకేష్ గాడిలో పెడుతున్నారు. వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలి. రానున్న కాలంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కిమిడి నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.