- సీపీఎం నేతల గృహనిర్బంధంపై నొచ్చుకున్న మంత్రి లోకేష్
- కొందరు పోలీసుల తీరు ఇంకా మారలేదని విమర్శ
అమరావతి(చైతన్యరథం): సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. తమని మన్నించాల్సిందిగా సీపీఎం నేతలను కోరారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ ముఖ్య అధికారులను లోకేష్ కోరారు.