అధికార పార్టీలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓటమి భయం వైసీపీ నాయకులను వెన్నాడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీ మూకలతో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. అయితే వాటిని టిడిపి శ్రేణులు సమర్థంగా తిప్పి కొడుతుండటంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రాజధాని అమరావతి, పుట్టపర్తి, తెనాలి లలో జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనం.
తెనాలి లో కౌన్సిల్ సమావేశ మందిరంలోనే ఏకంగా ఒక కౌన్సిలర్ ను చితకబాదిన సంఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఆ వీడియోలో కొంతమంది కౌన్సిలర్ లు వీధి రౌడీల తరహాలో దాడికి పాల్పడటం సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. ఆ సంఘటనను నిరసిస్తూ ఆర్యవైశ్య సంఘాలు శనివారం తెనాలి బంద్ కు పిలుపునిచ్చాయి. ఆ బంద్ కు టిడిపి మద్దతు ప్రకటించింది. బంద్ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా శాంతియుత నిరసన చేపట్టారు. అయితే కొంతమంది అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకొని నిరసన అడ్డుకోవడంతో మరోమారు ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపికి చెందిన నాయకులను అరెస్ట్ చేసి బలవంతంగా కొల్లిపర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసు వాహనం నుంచి టిడిపి వాణిజ్య విభాగం నాయకుడు డూండీ రాకేష్ క్రింద పడిపోయారు. దీంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్యవైశ్య సామాజిక వర్గంలో విబేధాలు సృష్టించే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు వ్యవహరించటంతో పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఏర్పడింది. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ ఆర్యవైశ్య సామాజికవర్గ ప్రతినిధులకు మద్దతుగా నిలిచి అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
పుట్టపర్తి లోనూ అధికార పార్టీ దౌర్జన్యం పరాకాష్టకు చేరింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనంతరం అక్కడి ఎమ్మెల్యే అవినీతి పై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ చోటుచేసుకున్నది. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పై దాడి జరిగింది. ఆయన వాహనాన్ని రౌడీ మూకలు ధ్వంసం చేశాయి. అయినప్పటికీ పోలీసులు పల్లె రఘునాథరెడ్డినిఅరెస్ట్ చేసి బలవంతంగా తరలించే ప్రయత్నంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఈ సంఘటనతో ప్రశాంత తకు ఆలవాలమైన పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అదే విధంగా రాజధాని అమరావతి పరిరక్షణ కోసం మహిళలు, రైతులు జరుపుతున్న ఆందోళన 1200 రోజులకు చేరుకుంది.
ఈ సందర్భంగా వైసీపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు అమరావతి రైతులవద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిజేపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై అధికార పార్టీ అండదండలతో మూడు రాజధానులు మద్దతుగా నిర్వహిస్తున్న శిబిరం వద్ద కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో బిజేపి నాయకుని వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. ఆ వాహనం లో వున్న పార్టీ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటనను టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ విధంగా వివిధ ప్రాంతాలలో అధికార పార్టీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు ఆ పార్టీ నాయకులలో నెలకొన్న అసహనాన్ని, అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.