అమరావతి(చైతన్యరథం): కుండ పోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదక వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్లో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారన్నారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ, సహకారాలు అందజేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారన్నారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు సహాయ చర్యల నిమిత్తం పంపించానని తెలిపారు.
ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గోవాలన్నారు. తన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారన్నారు. తన కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారని వెంకయ్యనాయుడు తెలిపారు.