అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. ‘ప్రజాదర్బార్’ కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్.. వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలపై సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి లోకేష్‌కు సమస్యలు విన్నవించుకున్నారు.
ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి: లోకేష్
గత ప్రభుత్వంలో బదిలీ ఉత్తర్వులు పొంది, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ ను పలువురు టీచర్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో 117 జీవో కారణంగా దూర ప్రాంతాలకు బదిలీ అయి అనేక ఇబ్బందులు పడుతున్నామని యువనేత దృష్టికి తీసుకువచ్చారు. ఏప్రిల్ 30న రిలీవై, మే 1న విధుల్లోకి చేరాల్సి ఉండగా… ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు అమలు కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ బదిలీల అంశంలో తాను చెడ్డపేరు తెచ్చుకోదల్చుకోలేదని స్పష్టం చేశారు.
పెన్షన్ మంజూరుచేసి ఆదుకోవాలి
తమ కుమార్తె దివ్యాంగ పెన్షన్ ను ఎలాంటి కారణం లేకుండా గత ప్రభుత్వం తొలగించిందని, తిరిగి పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన వి.సుజాత విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే కారణంతో గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ ను పునరుద్ధరించాలని ఉండవల్లికి చెందిన కె.ఇందిర కోరారు. భర్త లేని తనకు ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన బి.ధనలక్ష్మి విన్నవించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు కోరారు. క్యానర్స్ తో బాధపడుతున్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థికం సాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన రమేష్ విజ్ఞప్తి చేశారు.
నిరుపేద అయిన తాను నర్సింగ్ చదివానని, తనకు స్టాఫ్‌నర్స్ గా ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉండవల్లికి చెందిన పూడి పద్మావతి కోరారు. బీటెక్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని తెనాలి మండలం, ఖాజీపేటకు చెందిన సుంకర శివ వెంకట హరీష్ విన్నవించారు. గుంటూరు జిల్లా ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ అధికారులు తనకు మంజూరు చేసిన రుణాన్ని 15 నెలలుగా పెండిరగ్ లో పెట్టారని, కలెక్టర్ ద్వారా మంజూరు చేయించాలని మంగళగిరికి చెందిన బేతపూడి హైనీ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి ఐవోసీ ఎదురుగా ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి వసతి కల్పించాలని తాడేపల్లి ఎంఎస్‌ఎంఈ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కోరారు. ఆయా సమస్యల పరిష్కరానికి కృషిచేస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.