- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
అమరావతి (చైతన్యరథం): విద్యుదాఘాతానికి గురై నలుగురు యువకులు మృతి చెందడంపై పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఈ ఘోర విషాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు ఫ్లెక్సీలు కడుతుండగా ఐదుగురు యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో బొల్లా వీర్రాజు(26), మారిశెట్టి మణికంఠ (28), పామర్తి నాగేంద్ర(23), కాసగాని కృష్ణ(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఎదిగి వచ్చిన కుమారులు చనిపోవడంతో 4 కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ యువకుడు తణుకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
కాగా ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మంత్రులు సుభాష్, దుర్గేష్ తణుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించారు. మృతుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు.