అనకాపల్లి (చైతన్యరథం): అనాథాశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 23 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాధాశ్రమంలో కలుషితాహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తుండగా సోమవారం నలుగురు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధ, నిత్యగా గుర్తించారు. మిగతా 23 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు.
మెరుగైన చికిత్స అందించాలి: సీఎం చంద్రబాబు
కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేష్
అనాథాశ్రమంలో కలుషితాహారం తిని విద్యార్థులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ఘటనపై తన మంత్రివర్గ సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడానన్నారు అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించానని తెలిపారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని లోకేష్ స్పష్టం చేశారు.