తెనాలి (చైతన్యరథం): దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె పండుగ` పంచాయతీ వారోత్సవాలు భాగంగా ఆదివారం తెనాలి నియోజవర్గంలో ఐదు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్‌లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి అన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం. ఈ పథకానికి ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తోందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.