- ఇంటింటికీ అత్యవసర మందుల కిట్ల పంపిణీకి చర్యలు
- కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పీహెచ్సీల డాక్టర్లకు అదనంగా 238 మంది డాక్టర్లు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలకు వైద్య,ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం
విజయవాడ(చైతన్యరథం): విజయవాడ నగరంలోని వరద ప్రభావిత 32 డివిజన్ల పరిధిలో ఈనెల 6నుండి వార్డు సచివాలయానికో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. సమీప గ్రామాలైన జక్కంపూడి, అంబాపురం, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి సచివాలయాల పరిధిలో కూడా ఉచిత వైద్య శిబిరాల్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(యుపీహెచ్‌సీ) గురువారం రాత్రికల్లా వాహనాల ద్వారా మందుల బాక్సుల్ని చేరవేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. యుపిహెచ్‌సిల నుండి ఆయా వార్డు సచివాలయాల ఎఎన్‌ఎంలు మందుల్ని తీసుకుని వైద్య శిబిరాలకు అందజేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుపై గురువారం శాఖాపరంగా సమీక్షించారు. ఉచిత వైద్య శిబిరాల్లో సేవలందించేందుకు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లతో పాటు
ఏలూరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఆశ్రమ్) ఆసుపత్రి నుండి 35 మంది, గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్ కాలేజీ నుండి 41 మంది, ఎన్నారై ఆసుపత్రి నుండి 30 మంది, విజయవాడలోని పిన్నమనేని సిద్దార్ధ మెడికల్ కాలేజీ నుండి 30 మంది, నిమ్రా మెడికల్ కాలేజీ నుండి 30 మంది, జిజిహెచ్ గుంటూరు నుండి 32 మంది, జిజిహెచ్ విజయవాడ నుండి 30 మంది, జిజిహెచ్ మచిలీపట్నం నుండి 10 మంది డాక్టర్లను ఆగమేఘాల మీద నియమిస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్లకు సహాయకులుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించారు. వార్డుల వారీగా ఉచిత వైద్య శిబిరాలు, మందుల పంపిణీ కార్యక్రమాన్ని సమన్వయపర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారుల్ని ఇప్పటికే నియమించారు. హెలికాప్టర్ ద్వారా, అలాగే ఇతర మార్గాల ద్వారా దాదాపు 75 వేల అత్యవసర మందుల కిట్లను ఇప్పటికే గమ్య స్థానాలకు అధికారులు చేరవేశారు.
ప్రత్యేక వైద్య శిబిరాల్లో 41371 మందికి వైద్య సేవలు
వరద ముంపు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాల్ని ఈనెల 2 నుండి అందుబాటులోకి తెచ్చింది. 108 వైద్య శిబిరాల్ని నిర్వహించింది. 32 డివిజన్లలో ఈ నెల 2న ప్రారంభమైన ప్రత్యేక వైద్య శిబిరాల్లో మొత్తం 41371 మందికి వైద్య సేవలందించగా, గురువారం ఒక్కరోజే దాదాపు 12727 మందికి సేవలందించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు అనుకొని ఉన్న ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50కి పైగా వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేయడంతో పాటు, 104 వాహనాల ద్వారా మందుల్ని అందుబాటులో ఉంచి వైద్యులు, సిబ్బంది వైద్య సేవల్ని అందజేస్తూ వస్తున్నారు. ఈనెల 10 వరకూ కొనసాగే ఈ ప్రత్యేక వైద్య శిబిరాలకు ఇతర జిల్లాల నుండి కూడా వైద్యుల్ని వైద్య ఆరోగ్య శాఖ రప్పించింది. భారీ వరదల నేపథ్యంలో పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ బాధితులకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు గాను 32 వార్డులకు స్పెషాలాఫీసర్లుగా ఐఎఎస్ అధికారుల్ని నియమించిన విషయం తెలిసిందే.