- సామాన్యుడి దరిచేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
- అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- ట్రాన్స్‌పోర్ట్, లారీ అసోసియేషన్లు సహకరించాలి
- వారికి ప్రయోజనం చేకూరేలా సానుకూల నిర్ణయం
- వినియోగదారులు రవాణా ఖర్చు మాత్రమే భరించాలి
- స్టాక్ పాయింట్ల దగ్గర నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
- మైన్స్ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం
- తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు
- మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్
రాజమండ్రి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లే బాధ్యత అధికారులపై ఉందని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొ న్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక సరఫరా విధానంపై మరో మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహ కిశోర్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇన్‌చార్జ్ జేసీ జి.నరసింహులు, మైన్స్ ఏడీ ఎం. సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ సీఈ పుల్లారావు, ఎస్‌ఈ ఎస్.శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్డీవో కె.ఎల్.జ్యోతి, ఆర్.వి.రమణనాయక్, డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లారీ అసోసియేషన్ సమస్యకు పరిష్కారం
సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ పాయింట్‌లు, 71 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డి సిల్టేషన్ పాయింట్‌ల దగ్గర అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక పాలసీపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. లారీ అసోసియేషన్ సమస్య పరిష్కా రం దిశగా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒకటి రెండు నెలలు వేచి ఉంటే ప్రయోజనం చేకూరేలా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతవరకు మీరు వేచి ఉండే దోరణిలో ఉండాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి డిమాండ్ రావడం వల్ల ఇసుక డిమాండ్ రావడం గుర్తించామన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ధరలకు అనుగుణంగా వినియోగ దారు లకు ఇసుక అందించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడిరచారు.
చివరి వినియోగదారుడికీ ఇసుక సీఎం ఆలోచన
ముఖ్యమంత్రి ఆలోచన ఉచిత ఇసుక రవాణా చివరి వినియోగదారులకు చేరే ప్రక్రియపై సమగ్రంగా సమీక్ష చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, కేవలం ఇసుక రవాణా ఖర్చులు మాత్రమే వినియోగదా రులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏఏ రీచ్‌లలో ఎంత ఇసుక అందుబాటులో ఉందన్న విషయాన్ని వెల్లడిస్తున్నామని..ఆ మేరకు ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో అవసరమైన ఇసుకలో ఎక్కువ మొత్తం ఇక్కడ నుంచే సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉందని.. సమన్వయ లోపాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. బోట్స్ మ్యాన్ సొసైటీ ద్వారా తవ్వకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాలసీ విధానం పక్కదారి పట్టకూడదు
సచివాలయం ద్వారా వినియోగదారులు ఇసుకను బుక్ చేసుకుని తీసుకుని వెళ్లే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లక్ష్యం ఉచిత ఇసుక పాలసీ విధానంలో పక్కదారి పట్టకూ డదని పేర్కొన్నారు. స్టాక్ పాయింట్ వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనింగ్ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి 8 రీచ్‌లు, త్వరలో మరో 11 రీచ్‌ల ను కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం కనిపిస్తుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేలా ప్రతిఒక్కరూ కృషిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏడాదికి రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో కోటి మెట్రిక్ టన్నుల అవసరంగా కాగా ప్రస్తుతం ఆ మేరకు అందుబాటులో ఉంచడం జరిగిందని వెల్లడిరచారు.
ఉచిత ఇసుకపై త్వరలో మార్గదర్శకాలు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణం చేసే వారికీ ఇసుకని అందుబాటులోకి తీసుకుని వెళ్లే క్రమంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యమం త్రి, ఉప ముఖ్యమంత్రి మంచి ఆశయంతో రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఇసుక పాలసీ విధి విధానాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సరళీకృత విధానంలో ఇసుక అందచేసి రాష్ట్రంలో నిర్మాణ రంగానికి పునర్ వైభవం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. ఉచిత ఇసుక పాలసీపై మార్గదర్శకాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మూడు బృందాల పర్యవేక్షణలో రవాణా
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధాన అమలు తీరు, డీఎల్ ఎస్‌ఏలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సమర్థ్ధవంతంగా ఇసుక రవాణా చేసేందుకు మూడు బృందాలు అధ్వర్యంలో రిజిస్ట్రేషన్, లోడిరగ్, విజిలెన్స్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఇసుక రీచ్ మేనేజర్‌గా, ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రీచ్‌ల వద్ద ఇసుక రవాణాను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. అనధికార 8.82 లక్షలు అపరాధ రుసుము వసూలు చేసినట్లు వివరించారు. 14 కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయటం జరిగిందన్నారు. కార్యాచరణలో భాగంగా ఇరిగేషన్ ద్వారా 17 డిసల్టేషన్ పాయింట్స్ గుర్తిం చామని తద్వారా 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అవుతుందని అన్నారు. బోట్స్ మ్యాన్ సొసైటీలకు కేటాయింపుల కోసం టెండర్ పిలవాలని జిల్లా స్థాయి కమిటీలో ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడిరచారు.
స్థిరమైన ధరలు నిర్ణయించాలి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజల్లో ఉచిత ఇసుక రవాణా, లోడిరగ్, తదితర అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల కొంత అపోహ ఉందన్నారు. వాహన రవాణా ఖర్చుల విషయంలో కూడా స్థిరమైన ధర నిర్ణయించాలని సూచించారు. పట్టా భూములలో ఇసుక విధానంపై మార్గదర్శకాల జారీకి సూచనలు చేశారు. ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడు తూ ఇసుక రవాణా చేసే వాహనాల బరువు విషయం రహదారుల సామర్థ్యానికి అనుగు ణంగా ఉండేలా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే వాహనం వేచి ఉండే సమయం తగ్గేలా క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని రీచ్‌లు అందుబా టులోకి తీసుకుని రావడం, బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులకు పెండిరగ్ సొమ్ము చెల్లించాలని కోరారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఉచిత ఇసుక సరఫరాపై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ప్రభుత్వ నిర్మాణ పనులకు ఇసుక లభ్యత ఉండేలా చూడాలని సూచించారు. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ టోల్ గేట్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్ అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలు నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక ఉత్పత్తి పెంచాలని కోరగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో పాల్గొన్నారు.