టిడిపి అధికారంలోకి వచ్చాక జీవాలకు ఉచిత వైద్యం, మందులు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం ఆలూరు నియోజక్వర్గం గుడిమిర్ల శివార్లలో పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న వేంకటేశు, బాలమద్ది వద్దకు వెళ్ళి లోకేష్ వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. మాకు 300గొర్రెలు ఉన్నాయి. ప్రతిరోజూ వాటిని పొలం తోలుకెళ్లి మేపుకుంటాం. వేసవికాలం గొర్రెలు ఎక్కువసేపు ఎండలో ఉండలేవు. ఇంటివద్దే వాటిని మేపాల్సి ఉంటుంది. పొలాల్లో నీళ్లు దొరకడంలేదు. వాటికి మేత కొని వేసే స్థోమత సరిపోవడం లేదు. వాటికి వ్యాధులు వస్తే ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందడం లేదు.
ప్రభుత్వం ఇన్సూరెన్స్ లు చేయించడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించండి అనివారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గొర్రెలు, మేకలు పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జీవాలకు ఉచిత మందుల పంపిణీ నిలిపేశాడు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో కనీసం మందుబిళ్లలు కూడా దొరకడం లేదు. జీవాల పెంపకందారులే మందులు, వ్యాక్సిన్లు కొనుక్కుని, వైద్యం చేయించాల్సివస్తోంది. సబ్సిడీపై మేత పంపిణీ చేస్తాం. జీవాలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడేందుకు సబ్సిడీపై షెడ్లు నిర్మిస్తాం. ప్రతి జీవానికి ఇన్సూరెన్స్ చేయించి ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.