- కొనియాడిన హోం మంత్రి వంగలపూడి అనిత
- కెఎస్ వ్యాస్, ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి అధికారులు ఆదర్శం
- టెక్నాలజీతో సైబర్ నేరాల నియంత్రణ
- సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు
అమరావతి(చైతన్యరథం): పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లనే సమాజం స్వేచ్ఛగా జీవిస్తూ, భద్రంగా బతుకుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తెగువను నేర్పుతూ కని, పెంచిన పోలీసుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆమె సెల్యూట్ చేశారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఈ సమాజం రుణపడి ఉందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదిరించి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి వారెందరో పోలీస్ వ్యవస్థకే ఆదర్శమన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి ఈ సందర్భంగా హోం మంత్రి అనిత నివాళులర్పించారు. నవతరానికి ఉత్సాహాన్ని స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహించుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశమన్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తామని హోం మంత్రి వెల్లడిరచారు. విజయవాడ కమిషనరేట్ కేంద్రంగా సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై సామాన్యులకు అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి తెలిపారు. తుపానులు, వరదలు, దసరా శరన్నవరాత్రులు, శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తులో పోలీసుల పనితీరును ఆమె ప్రశంసించారు. విజయవాడ వరదల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది అందించిన సేవలు యావత్ దేశాన్ని కదిలించాయన్నారు. యువత.. డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారాఅవగాహన కలిగించి అప్రమత్తం చేస్తామన్నారు.