మంగళగిరి : టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు లభించాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నాగార్జున యూనివర్శిటీ సమీపంలో మంగళవారం జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ వెంటే బీసీలు ఉన్నారనే అక్కసుతోనే జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. నన్ను 80 రోజులు జైల్లో పెట్టి వేధించారు, ఎటువంటి తప్పు చేయకపోయినా, పైసా అవినీతికి పాల్పడకపోయినా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జగన్‌రెడ్డి విధ్వంసకర పాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు. బీసీల సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయలేదు.
జగన్‌ను, అతని పార్టీని ఎంత త్వరగా బంగాళాఖాతంలో కలిపితే అంత త్వరగా బీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది. జగన్ బీసీలకు వాక్ స్వాతంత్య్రం కూడా లేకుండా చేశాడు. బీసీలకు అండగా ఉండేది చంద్రబాబునాయుడే.. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా స్పందించేవారు. బీసీలు గెలవాలంటే టీడీపీ-జనసేన కూటమి గెలవాలి. దుర్మార్గుడైన జగన్ దిగిపోవాలని బీసీలు సహా మొత్తం రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.