.టీడీపీ జాతీయ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు
అమరావతి: అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే మనం అనుభవించే ఈ స్వాతంత్య్రం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన మువ్వవెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు, తమ యువనాయకుడు లోకేష్‌బాబు తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నవారిని గుర్తు చేసుకుందామని చెప్పారు. దేశం పురోభివృద్ధిలో మనమందరం భాగస్వామ్యులమవుదామని పిలుపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకమన్నారు. సమాజ హితం కోసం స్వాతంత్య్ర ఫలాలను ప్రతిఒక్కరికీ అందించడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బురగడ్డ వేదవ్యాస్, టీడీపీ నేతలు చప్పిడి రాజశేఖర్, దారపనేని నరేంద్ర బాబు, కరీముల్లా, పీరయ్య, భానుతేజ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.