- ఎన్డీయేపై ప్రజా నమ్మకాన్ని నిలుపుకున్నాం
- చీకటినుంచి వెలుగులకు అడుగులేస్తున్నాం
- ప్రధాని మోదీ సారథ్యమే శ్రీరామ రక్ష
- రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది..
- అందుకు నిదర్శనమే రూ.2 లక్షలకోట్ల అభివృద్ధి
- ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు
- భారత్‌ను ముందుకు నడిపిస్తున్న మోదీకి ప్రణామం
- విశాఖపట్నం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విశాఖపట్నం (చైతన్య రథం): ‘అభివృద్ధికి ఆస్కారమేలేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఎన్డీయే ప్రభుత్వం కష్టపడి పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ఐదేళ్ల చీకటి రోజులు, అరాచక పాలననుంచి మళ్లీ వెలుగు రేఖలు పూయించడానికి అడుగులు వేస్తున్నామని, అందులో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చామన్నారు. అభివృద్ధి నిరంతర యజ్ఞంగా కొనసాగాలని, ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ మరింత అండగా నిలుస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందన్నారు. బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తైన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘‘సదుద్దేశం.. సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక సదాశయం.. సత్సంకల్పంతో ఇంకొకకరు కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు ప్రజలతో మమేకమై వారందర్నీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మ నిర్భర్ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు ప్రజలకు వారి పరిసరాల శుభ్రత, బాధ్యత తెలియజేస్తే అది స్వచ్ఛభారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్యసాహసాలు నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారత్ అవుతుంది. అది ఒక రోజున అఖంఢ భారత్‌గా వర్దిల్లుతుంది.
ఒక బలమైన భారత్ కోసం, ధృడమైన దేశం కోసం, జగత్ అంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ.. ఆ క్రమంలో ఎదురైన ప్రతి పరాజయాన్ని, ప్రతి అవమానాన్ని నవ్వూతూ స్వీకరిస్తూ.. వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నా తరఫున, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నమస్కారాలు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న దార్శనికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నమస్కారాలు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కట్టబెట్టిన ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు. నిలబడ్డారు. అలా నిలబడినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఈరోజున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు మొత్తం కలిపి రాష్ట్రానికి రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులు, ఏడున్నర లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అభివృద్ధిలో సమాన వాటా మోదీ సంకల్పం
అవినీతిలో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ.రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవికాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధానిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా.. నమ్మకం.. ప్రధాన మంత్రిపై చూపిన నమ్మకం నేడు రూ.రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి. 70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుండడమే కారణం. భారతదేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఏప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం
ఆంధ్ర అభివృద్ధికి అస్కారమే లేదనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొనేలా చంద్రబాబునాయుడు నాయకత్వంలో, ప్రధాని నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. వారి సూచనలు, సలహాలతో రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతామని చెప్పారు. దేశ ప్రగతిలో భాగస్వాములై ప్రధానికి అండగా ఉంటామన్నారు. అయితే, ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. దేశాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేలా నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.