- 15శాతం వృద్ధితోనే స్వర్ణాంధ్ర-2047 సాధ్యం
- ప్రజలపట్ల ప్రతి అధికారీ బాధ్యత చూపాలి
- సంక్షేమాన్ని గౌరవప్రదంగా అందించండి..
- ఏప్రిల్ తొలివారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్
- 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
- అన్న క్యాంటీన్లపై నిరంతర పర్యవేక్షణ
- వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టండి
- జిఎస్డీపీ పెరుగదలకు గట్టిగా కృషి చేయాలి
- కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా
- తొలిరోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు 9 నెలల పాలనలో కృషి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని అధిగమించి ప్రగతి సాధించేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మొదటిరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి… రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏంచేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలపై కలెక్టర్ల ప్రభావం ఎక్కువ ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వత ప్రభావం చూపిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.
ప్రజా సంక్షేమం మీ బాధ్యత
సంక్షేమం ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలి. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరిస్థాయికి చేరాలి. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్టు కాకుండా గౌరవభావంతో ఇవ్వాలి. ప్రతి అధికారీ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకెళ్లాలి. మీరు చేసే ప్రతిపనినీ సమీక్షిస్తున్నాం. పౌరులకు అందించే 22 సేవలనుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మా కోసమే పని చేస్తోందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
డీఎస్సీ మెగా నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పగడ్బంధీగా మెగా డీఎస్సీ నిర్వహించాలి. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే దస్త్రంపైనే మొదటి సంతకం చేశాం. పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలి. గతంలో రాష్ట్రంలో ఒకేసారి 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలిచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. 80 శాతం ఉపాధ్యాయులను మా హయాంలోనే నియమించామని చంద్రబాబు గుర్తు చేశారు.
విజన్ మనకొక డైరెక్షన్
స్వర్ణాంధ్ర `2047 డాక్యుమెంట్‌లో 10 సూత్రాలు పొందుపరిచాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు ఉండాల్సిందే. జిల్లాలో విజన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కలెక్టర్ ఉంటారు. నియోజవకర్గాలకు ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి. పర్యావరణ, ఇతర అనుమతులకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
పాలనకు ప్రజామోదం ఉండాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ కొద్ది కాలంలోనే 3వసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రతి త్రైమాసికానికి ఒక సమావేశం పెట్టుకుని రాబోయే 3 నెలలు ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడానికి ప్రయత్నించాలి. గత ఐదేళ్లూ రాష్ట్రంలో విధ్వంసమే సాగింది. దీంతో ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యక్తమైంది. ఎన్నికల్లో కూటమికి 93 శాతం స్ట్రైక్‌రేట్ వచ్చింది. దీనికి కారణం విధ్వంస పాలనను ప్రజలు ఆమోదించలేదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆశలు కూడా ఎక్కువగానే పెట్టుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఆదాయంతోనే సంక్షేమం సాధ్యం
సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అనే మూల స్తంభాలపైనే సుపరిపాలన ఆధారపడి ఉంటుంది. పేదరికంపోయి ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాల అమలు తప్పనిసరి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం రావాలి. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే స్థిరంగా కొనసాగవు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చాలి, వాటికి వడ్డీలు కట్టాలి అంటూ రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు.
చాలా హామీలు నెరవేర్చాం
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చాం. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫింఛన్‌లు రూ.4 వేలు ఇస్తున్నాం. రూ.200 ఉన్న పింఛన్‌ను 2014లో రూ.2 వేలు చేశాం. ఇప్పుడు రూ.3 వేలనుంచి రూ.4 వేలకు ఒకేసారి పెంచాం. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు చేశాం. దాన్ని మళ్లీ ఇప్పుడు రూ.6 వేలకు పెంచాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైనవారికి మానవతా దృక్పదంతో రూ.15 వేలు ఇస్తున్నాం. ఇంతమంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు ఇవన్నీ తెలియజేయాలి. అందుకే ప్రతినెలా 1న ‘పేదల సేవలో..’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
అన్నా క్యాంటీన్‌లు సందర్శించండి
రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడానికి 204 అన్న క్యాంటీన్‌లు నెలకొల్పాం. కలెక్టర్‌లు కూడా అన్న క్యాంటీన్‌లను సందర్శించాలి. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్‌లు ఇస్తున్నాం. ఇచ్చినమాట ప్రకారం చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపులు 10 శాతం కేటాయించాం. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేశాం. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం. బీసీ, ఎస్సీలకు ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా ఇస్తున్నాం. ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగిలి ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు సూచించాలి. ఎక్కడా తాగునీరు లేదనే మాట రాకూడదని కలెక్టర్లకు జాగ్రత్తలు చెప్పారు.
2027నాటికి పోలవరం నిర్మాణం పూర్తి
పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడినపెట్టామని చంద్రబాబు అన్నారు. 2027నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. అమరావతి రాజధాని పనులు కూడా చేపట్టామని, ప్రపంచబ్యాంకు, ఏడీబీవంటి సంస్థలనుంచి ఆర్థిక సాయం తీసుకుంటున్నామని వివరించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌గా అమరావతి అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలూ భాగస్వాములయ్యేలా చర్యలుండాలి. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ తరహా మోడల్స్ చేపట్టాలి. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అమరావతితో ప్రారంభమైంది. అమరావతి రాజధానికి కొత్త రైల్వేలైన్‌తో పాటు, విశాఖ రైల్వేజోన్ సాధించామని అన్నారు.
ప్రయాణం సాఫీగా సాగేలా రోడ్లు
గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా గోతులే ఉన్నాయి. అందుకే రూ.861 కోట్లతో 20 వేల కి.మీ మేర గుంతలు పూడుస్తున్నాం. దాదాపు 95శాతం మేర పనులు పూర్తయ్యాయి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడీ ఇస్తున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళను చేశాం. రూ.4 వేల కోట్లతో 40 వేల పనులను పల్లె పండుగ కార్యక్రమం కింద ప్రారంభించాం. వాటర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. మే నెలలో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తాం. స్కూళ్లు తెరిచేలోపు అమ్మఒడి అందజేస్తాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20వేలు అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జీఎస్డీపీ పెరుగుదల తప్పనిసరి
విజన్ అమల్లో రాజకీయ ఒత్తిడిలు తలెత్తకుండా జిల్లాలకు స్థానికేతర అధికారులను జిల్లా ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌గా నియమించామన్నారు. జిల్లాల్లో సంపద సృష్టికి ఏం చేయగలుగుతారో ఆలోచించాలి. జీఎస్డీపీ పెరుగుదల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. తద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. రూ.3.27 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. వచ్చే ఏడాదికి 15 శాతం తగ్గకుండా జీఎస్‌డీపీ సాధించేలా కలెక్టర్‌లు కృషిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 2014-19 మధ్య 13.5 శాతం గ్రోత్ రేట్ ఉంటే 2019-24 మధ్య 10.32 శాతానికి తగ్గింది. 2024-25 మధ్య 12.02 గ్రోత్‌రేట్ సాధించాం. ఒక శాతం గ్రోత్ రేట్ పెరిగితే రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. 2047 నాటికి రూ.54.60 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. తలసరి ఆదాయం 2023-24 మధ్య రూ.2.66 లక్షల ఉంటే, 2024-25 మధ్య రూ.2.98 లక్షలకు పెరిగింది. స్వర్ణాంధ్ర విజన్‌లో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలనేది ప్రభుత్వ సంకల్పంగా చంద్రబాబు వివరించారు.
వ్యవసాయరంగంపైనా దృష్టి పెట్టాలి
ఏపీ అంటే ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుంది. జిల్లాల్లో వ్యవసాయం, దాని అనుబంధరంగాలపైన దృష్టి పెట్టాలి. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలి. హార్టికల్చర్‌కు సీమలో మంచి అవకాశాలున్నాయి. సీమలో ఇప్పుడు డెల్టాకంటే మంచి ఆదాయం వస్తోంది. అనంతపురం ఒకప్పుడు కరవు జిల్లాగా మారుతుంది అనుకున్నాం. కానీ హార్టికల్చర్, పరిశ్రమల రాకతో రాష్ట్రంలో 5వ ఆర్థిక వ్యవస్థగా మారింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ఎనర్జీ పరిశ్రమలు వస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకెళ్తున్నాం. పర్యాటకంలో 20 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.
బకాయిలన్నీ వసూలు చేయాలి
జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలని చంద్రబాబు సూచించారు. పన్ను ఎగవేతదారులపట్ల కఠినంగా ఉండాలి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ శాఖలో ఫిర్యాదుల రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్టు భావిస్తాం. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దు. గంజాయి సరఫరా చేసి, రౌడీయిజం చేసేవారిపట్ల ఉక్కుపాదం మోపండి. శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు జిల్లా ఎస్సీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.