- గ్రోత్ కారిడార్ల ఆధారంగానే పెంపుదల
- సగటున 15 నుండి 20 శాతం వరకు పెరుగుదల
- చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో తగ్గింపు
- రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లిలోని ఐజీ కార్యాలయంలో సోమవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, అయితే రాష్ట్రానికి ఆదాయం కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి మార్కెట్ రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లిందని, దీంతో చాలా చోట్ల భూమి వాస్తవ విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నట్లుగా తమ పరిశీలనలో తేలిందన్నారు. అటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు.
ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుండి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే వస్తుండగా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోనూ 10 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పారు. వీటిన్నంటినీ పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో ఒక్క సెప్టెంబర్ మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ అదనపు ఆదాయమే వచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి తాము టార్గెట్‌గా పెట్టుకున్న 9,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి తన స్వార్థం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా ఇబ్బందులు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం వారితో స్నేహ పూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పారు. భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా 11 వేల ఫిర్యాదులను అక్కడిక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఇలా పరిష్కరించిన సమస్యలను ముందుగానే ఎందుకు చేపట్టలేదంటూ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విలేకరుల సమాశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు.